
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఈనెల 19న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వాహనాల పార్కింగ్, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం ప్రాంగణంలో తిరుగుతూ సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.