ఒంటి గంటకు మంత్రివర్గ భేటీ.. అత్యంత కీలక నిర్ణయాలు!

KCR Meeting With Ministers Before Pragathi Nivedhana Sabha - Sakshi

నేడు ఒంటి గంటకు మంత్రివర్గ భేటీ 

పాలనపరంగా పలు కీలక నిర్ణయాలు 

ఉద్యోగులకు మధ్యంతర భృతిపై నిర్ణయం 

ఆసరా పింఛన్ల మొత్తం పెంచే అవకాశం

  నిరుద్యోగ భృతిపై ప్రకటన.. భారీగా కొత్త పోస్టులు

శాసనసభ నిర్వహణ, రద్దుపై నిర్ణయం! 

సభకు ముందే భేటీ జరుగుతుండటంతో ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో జరగనుంది. అసెంబ్లీ రద్దు జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగేళ్ల మూడు నెలల పాలన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’కు ముందు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓ వైపు అధికార పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం, మరోవైపు మంత్రివర్గ సమావేశం ఒకేరోజు జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన పరంగా, రాజకీయంగా మొత్తం దృష్టి అటు వైపే పడింది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ మదిలో ఏముందనేది ఎవరికీ అంతుచిక్కడంలేదు. అయితే సమావేశంలో పరిపాలనపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌), ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు, మెగా డీఎస్సీతోపాటు భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతి వంటి నిర్ణయాలు జరగనున్నట్లు సమాచారం. 

ప్రతిపాదనలకు తుదిరూపు 
రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నెల రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఈ చర్చ ఇంకా పెరిగింది. అనంతరం అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆగస్టు 27న అన్ని శాఖలను ఆదేశించారు. అదేరోజు సాయంత్రం అన్ని వివరాలను పంపాలని సూచించారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీలు జరుపుతూ అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై తుది నిర్ణయానికి వచ్చారు. 

ఉద్యోగులకు మధ్యంతర భృతి.. 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగులకు మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రియ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాయి. అయితే పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్‌ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్‌సీ కమిటీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. కమిటీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మెగా డీఎస్సీ.. నిరుద్యోగ భృతి ప్రకటన 
ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి ప్రకటనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఉద్యోగ ప్రకటనలు, భర్తీ గురించి కూడా చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ఆసరా పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది ప్రతి నెల పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగులకు పింఛన్‌ నెలకు రూ.2 వేలు, ఇతర వర్గాలకు రూ.1,500కు పెంచే అవకాశాలపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. భారీగా ప్రభుత్వ పోస్టులకు అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ (టీఆర్టీ) ప్రకటించేలా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. 

అసెంబ్లీ సమావేశాలా?.. రద్దా? 
శాసనసభ నిర్వహణపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. బడ్జెట్‌ సందర్భంగా ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ చివరిసారిగా సమావేశమైంది. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. రికార్డుల ప్రకారం ఈనెల 27లోపు శాసనసభ సమావేశం జరగాలి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలోనే రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలను మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఒకవేళ అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండనుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top