మోగిన హరిత హారన్‌..

KCR Launch Haritha Haram Phase 4 In Gajwel - Sakshi

గజ్వేల్‌లో నాలుగో విడత హరితహారం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

పెద్ద ఎత్తున కదిలొచ్చిన జనం 

లక్ష్యానికి మించి 1,25,235 మొక్కలు 

ఇందిరా పార్కు చౌరస్తాలో కదంబ మొక్క నాటిన ముఖ్యమంత్రి 

 హరితహారంపై మహిళల స్పందన ఎలా ఉందంటూ ఆరా

సాక్షి, సిద్దిపేట :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం గజ్వేల్‌లో ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇందిరా పార్కు చౌరస్తాలో కదంబ మొక్క నాటారు. ఆ వెంటనే సైరన్‌ మోగడంతో చిన్నాపెద్దా, అధికారులు, నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మొక్కవోని దీక్షతో కదిలారు. లక్ష్యాన్ని మించి 1,25,235 మొక్కలు నాటి హరితహారానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన సీఎం నేరుగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చేరుకొని అక్కడ విడుపకా భాగ్యమ్మ ఇంటికి వెళ్లి కొబ్బరి మొక్క నాటారు. అనంతరం ఆమె కుటుంబీకులతో కొబ్బరి, సపోటా ఇతర పండ్ల చెట్లు నాటించారు. ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వారికి సూచించారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి సహజ వనరుల అభివృద్ధిలో భాగంగా సింగాయిపల్లిలో పెంచిన అడవిని పరిశీలించారు. తక్కువ కాలంలో సహజసిద్ధమైన అడవిని రూపొందించిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు నగదు బహుమతి అందచేస్తామని తెలిపారు. పచ్చటి అడవులు, ఆహ్లాదకర వాతావరణంలో ఎమ్మెల్యేలందరితో వన భోజనాలకు వస్తామని అధికారులకు చెప్పారు.
 
మొక్క నాటగానే మోగిన సైరన్‌ 
గజ్వేల్‌లో సీఎం మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌ ప్రాంతాల్లో అధికారులు సైరన్‌ మోగించారు. ఐదు నిమిషాలు ఆగకుండా సైరన్‌ మోగడంతో అందరూ మొక్కలు నాటేందుకు కదిలారు. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అరుణను పిలిచి హరితహారం తీరుపై మహిళలు ఏమంటున్నారు? వారి స్పందన ఎలా ఉందంటూ సీఎం ఆరా తీశారు. సిద్దిపేటలో అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా 1,00116 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు గజ్వేల్‌ పట్టణవ్యాప్తంగా 1,25,235 మొక్కలను నాటడం విశేషం. 

కొబ్బరి మొక్క నాటిన సీఎం 
హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌లోని కూర భారతమ్మ ఇంటికి వెళ్లి కొబ్బరి మొక్క నాటారు. అనంతరం భారతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. నాటిన మొక్కలను పిల్లల లెక్క సాదుకోవాలని సూచించారు. తర్వాత అక్కడ్నుంచి సీఎం బస్సులో హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌మోహన్, వివేకానందరెడ్డి, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్‌ అధికారి పీకే ఝా, డోపియల్, సిన్హా, స్పెషల్‌ సెక్రటరీలు భూపాల్‌రెడ్డి, అజయ్‌మిశ్రా, తివారీ, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తదితరులు పాల్గొన్నారు.

అటవీ పరిరక్షణకు గ్రీన్‌ బ్రిగేడ్‌ 
వర్గల్‌ (గజ్వేల్‌): సహజ అడవుల పునరుజ్జీవం కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసిన వర్గల్‌ మండలం సింగాయపల్లి అడవిని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. గజ్వేల్‌ వెళ్తుండగా రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఈ అడవి వద్ద ఆగారు. 20 నిమిషాలపాటు అడవిలో గడిపిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. మొక్కలను, ఫైర్‌లైన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల కృషిని ప్రశంసించారు. ఈ అడవిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రస్థాయిలో అడవుల అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. అడవుల పరిరక్షణకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ బ్రిగేడ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గజ్వేల్‌లోని మదీనా మసీదులోని కబ్రస్థాన్‌లో 1,900 మొక్కలు నాటిన పోలీస్‌ శాఖను సీఎం అభినందించారు. 

కురిసిన వర్షం.. జనం హర్షం 
గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌లో సీఎం కదంబ మొక్క నాటగానే ఒక్కసారిగా చిరుజల్లులు కురిశాయి. అనంతరం ముఖ్యమంత్రి ప్రజ్ఞాపూర్‌లోని కూర భారతమ్మ ఇంట్లో మొక్క నాటేందుకు వెళ్తున్న సమయంలో మరోసారి వర్షం పడింది. సీఎం అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో సుమారు 20 నిమిషాలకు పైగా వర్షం కురిసింది. తాము నెల నుంచి ఎదురుచూస్తున్నా పడని వర్షం.. సీఎం మొక్క నాటిన వెంటనే కురిసిందంటూ జనం హర్షం వ్యక్తం చేశారు. 

అరుణమ్మా.. అమ్మలక్కలేమంటున్నారు?
గజ్వేల్‌: ‘‘అరుణమ్మా... హరితహారంపై అమ్మలక్కలేమంటున్నారు...? మొ  క్కలు నాటేందుకు ముందుకొస్తున్నారా..’’అంటూ సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దుంబాల అరుణను అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్‌లో హరితహారాన్ని ప్రారంభించిన అనంతరం పక్కనే ఉన్న అరుణను పిలిచి.. మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళల స్పందన ఎలా ఉందంటూ ఆరా తీశారు. ‘‘మీరు పట్టణానికి ఎంతో చేశారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నమూనాగా నిలబెట్టారు. ఇదే విషయాన్ని మహిళలకు చెబుతున్నాం. మొక్కలు నాటి వాటిని పరిరక్షించి సీఎంకి కానుకగా ఇద్దాం’’అని చెబితే అంతా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని ఆమె సీఎంకు చెప్పారు. 

మురిసిపోయిన భారతమ్మ 
జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): ‘‘మొక్కలు నాటగానే అయిపోదు. వాటిని పెద్ద చేస్తేనే లెక్క. నేను మొక్క పెట్టి పోతా.. మీ పిల్లల లెక్క సాదుకోవాలె. ఇంట్లో ఎంత మంది ఉన్నరు? ఎన్ని మొక్కలు నాటుతున్నరు’’అని సీఎం కేసీఆర్‌ కూర భారతమ్మను ఆప్యాయంగా పలకరించారు. ప్రజ్ఞాపూర్‌లో భారతమ్మ ఇంట్లో కొబ్బరి మొక్క నాటిన అనంతరం ఆమె కుటుంబీకులతో సీఎం కాసేపు ముచ్చటించారు. తమ ఇంటి పెరట్లో 18 మొక్కలు నాటుతున్నామని ఆమె సమాధానమిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి సీఎం ఫొటోలు దిగారు. సీఎం మొక్క నాటి వెళ్లగానే కాలనీ వాసులు భారతమ్మ ఇంటికి బారులు తీరారు. వందలాది మంది వచ్చి సీఎం నాటిన కొబ్బరి మొక్కను చూసి సంబరపడ్డారు. యువకులు, ప్రజాప్రతినిధులు మొక్క వద్ద సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ‘‘సీఎం సారు నాటిన కొబ్బరి మొక్కను నా మనుమళ్లును చూసుకున్నట్టే చూసుకుంటా. మా ఇంటికి సీఎం వస్తాడని కలలో కూడా అనుకోలేదు’’అని భారతమ్మ ఆనందం వ్యక్తం చేశారు. 

పొరుగు వారితో మాటామంతీ 
భారతమ్మ ఇంట్లో మొక్క నాటేందుకు వచ్చిన సీఎంకు పక్కింటి మహిళ ఎల్లా రేణుక మంగళహారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టింది. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు ఆమెతో సీఎం మాట్లాడారు. ‘‘పూల మొక్కలు బాగున్నాయి. ఇప్పుడు ఏం మొక్కలు పెడుతున్నరు. ఇంతకు ముందు పెట్టిన మొక్కలు మంచిగున్నయా? ఎక్కడెళ్లి నీళ్లు తెచ్చి పోస్తున్నరు’’అని సీఎం అడగ్గా.. ‘‘సారూ గతంలో నాటిన పూల మొక్కలు ఇప్పుడు మస్తు పూలు పూస్తున్నాయి. మిషన్‌ భగీరథ నీళ్లే పోస్తున్నా’’అని రేణుక సమాధానం చెప్పారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top