కేసీఆర్‌ కిట్ల జాడేదీ..

KCR Kits Distribution Is Not Implemented Warangal - Sakshi

హన్మకొండచౌరస్తా (వరంగల్‌): బాలింతల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేసీఆర్‌ కిట్ల పంపిణీ’ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. ఆరు నెలల పాటు సజావుగానే సాగిన ఈ పథకంలో గత 8 నెలలుగా పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి కేసీఆర్‌ కిట్ల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఆయా ఆస్పత్రుల్లో ప్రసవం పొందిన బాలింతలను ఒట్టి చేతులతో ఇంటికి  పంపిస్తున్నారు.  ఈ మేరకు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి కేంద్రం, సీకేంఎం ప్రసూతి ఆస్పత్రి లో ‘సాక్షి’ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.  రాష్ట్ర ప్రభుత్వం వద్ద కిట్ల కొరత లేనప్పటికీ జిల్లా వైద్యాధికారులు ఇండెంట్‌ పంపటంలో నిర్లక్ష్యం వహించడం వల్లే సమస్య ఉత్పన్నం అవుతున్నట్లు తెలిసింది.
 
వేధిస్తున్న కిట్ల కొరత..
హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో ఈ నెల రెండో వారం మొదటి నాలుగు రోజుల్లో 60 ప్రసవాలు జరిగాయి.  ప్రసవం జరిగిన వెంటనే వారికి కేసీఆర్‌ కిట్‌ ఇవ్వాలి. అయితే కిట్ల కొరతతో ‘రేపు ఇస్తాం..మాపిస్తాం’ అంటూ కాలయాపన చేసి  7 రోజుల అనంతరం వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు.  ఈ కిట్‌తో పాటు గర్బిణీగా నమోదైనప్పటి నుంచి ప్రసవం  తర్వాత వరకు తల్లుల ఖాతాలో విడతల వారీగా రూ.12వేలు జమ  చేయాల్సి ఉండగా, కొంత మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. సీకేఎం ఆస్పత్రిలో గురువారం నుంచి దాదాపు 80 మంది బాలింతలకు కిట్లు ఇవ్వలేదు.
 
చీరలు లేకుండానే ..
ప్రసవించిన రోజే బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ కిట్‌లో రూ.2 వేల విలువ చేసే 16 వస్తువులుంటాయి. శిశువుకు ఉపయోగపడేలా రూ.350 విలువ గల దోమ తెర,  రూ.90ల విలువైన బేబీ మాకిటోష్,  రూ.200 వి లువైన  రెండు డ్రెస్‌లు, రూ.100 విలువ చేసే రెం డు టవల్స్, రూ.100 విలువ చేసే బేబీ న్యాప్‌కిన్స్,  జాన్సన్‌ బేబీ పౌడర్,  బేబీ షాంపూ,  బేబీ ఆయిల్,  బేబీ సోప్, సోప్‌ బాక్స్,  ఆట వస్తువులు ఉంటా యి..  బాలింత కోసం  రెండు సబ్బులు, రూ .350 విలువ చేసే రెండు చీరలు, రూ.150 విలువైన కిట్‌ బ్యాగ్, ప్లాస్టిక్‌ బకెట్‌  ఇస్తారు. అయితే ఆరు నెలల పాటు సజావుగానే సాగిన ఈ పథకంలో తరువాత ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి. కిట్లలో 16 వస్తువులకు బదులుగా కొన్నింటిలో చీర, బకెట్‌ ఇతరత్రా వస్తువులు లేకుండానే పంపిణీ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 

కిట్లు లేవంటున్నారు..
హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈనెల 16న డెలివరీ అయింది. రెండో కాన్పులో పాప పుట్టింది. పాప పుట్టగానే కేసీఆర్‌ కిట్‌ ఇస్తారని మా బంధువులు చెబితే సిబ్బందిని అడిగాం. కిట్లు అయిపోయాయి రాగానే ఇస్తామని చెప్పారు. అంతే కాదు పాప పుడితే రూ. 13వేలు అకౌంట్‌లో  వేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. – రమ్య, గాంధీనగర్, ములుగు గణపురం

ఎప్పుడు వస్తాయో తెలియదు..
నాలుగు రోజుల క్రితం కేసీఆర్‌ కిట్లు అయిపోయాయి. అదే రోజు æ డీఎంహెచ్‌ఓకు ఇండెంట్‌ పంపించాం. హైదరాబాద్‌ నుంచి రావాలని చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో సుమారు 60మందికి కేసీఆర్‌ కిట్లు అందించాల్సి ఉంది. రాగానే పిలిచి అందజేస్తాం. – డాక్టర్‌ నిర్మల, సూపరింటెండెంట్, జీఎంహెచ్, హన్మకొండ. 

డెలివరి అయి వారం రోజులైంది..
హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో ఈనెల 10న డాక్టర్లు పెద్ద ఆపరేషన్‌ చేసి డెలివరీ చేశారు. రెండో కాన్పులో బాబు పుట్టాడు. వారం రోజులు కావడంతో ఈ రోజు డిశ్చార్జి రాశారు. ప్రసవించిన రోజే కేసీఆర్‌ కిట్‌ ఇస్తారు కదా అని అడిగితే, ఇప్పుడు లేవు రాగానే ఇస్తామని వారం రోజులుగా చెబుతు వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే అడిగినా.. రాగానే ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. – మౌనిక, గునిపర్తి, కమలాపూర్‌ మండలం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top