కేసీఆర్ మాటల మాంత్రికుడు | KCR is a magician :indra sena reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాటల మాంత్రికుడు

Nov 16 2014 2:56 AM | Updated on Sep 5 2018 3:38 PM

ఎన్నికల ముందు, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు...

ఖమ్మం: ఎన్నికల ముందు, ఆ తర్వాత  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నాడని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట మార్చి తానే సీఎం పీఠంపై కూర్చున్నారన్నారు.

వ్యవసాయ రుణాల మాఫీలోనూ ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. విద్యుత్ లేక, పంటలు ఎండిపోయి, అప్పుల భారం మోయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. చివరకు తెలంగాణ అమరుల విషయంలోనూ పూటకో మాట మార్చుతున్నారని, ఉద్యమాన్ని కించపరుస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రంపై ఆరోపణలు చేయడమే తప్ప కరెంట్ సమస్యను అధిగమించేందుకు చేసిన ప్రయత్నమేమీ లేదన్నారు. కృష్ణా నీటి వినియోగంపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు. పెన్షన్లు, తెల్లరేషన్‌కార్డుల్లో కోత పెడుతున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ధర్మారావు, నాగపూరి రాజలింగం, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement