
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల(ఆర్టిజన్ల)కు శుభవార్త. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు పట్ల ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లకు పేస్కేల్, పీఆర్సీ వర్తింపజేస్తామని ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టిజన్లుగా క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నారు.
కేసీఆర్ ఆదేశాలతో..
విద్యుత్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దశాబ్దాలుగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ల చేతిలో శ్రమదోపిడీకి గురయ్యారు. రాజకీయ నేతలు, విద్యుత్ ఉన్నతాధికారులు బినామీల పేర్లతో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వహిస్తూ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శించేవారు. విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నేరుగా వేతనాలు చెల్లించి కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి రక్షించాలని కోరుతూ విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రం ఏర్పడ్డాక ఆందోళనలు నిర్వహించారు. ఈ అంశంపై పలుసార్లు అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్ చివరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు 23 వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ గతేడాది విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో క్రమబద్ధీకరణను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆర్టిజన్లకు ఊరట లభించింది.
మానవీయతతో నిర్ణయం..
ఆర్జిజన్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకుందని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సీఎం కేసీఆర్ చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇది పండుగ రోజని అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావొద్దని, మంచి జీవన ప్రమాణాలతో జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పేస్కేల్ నిర్ణయించాలని, వారికి పీఆర్సీ వర్తింపజేయాలని సీఎండీని సీఎం ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టిజన్లు ఇక రెగ్యులర్ ఉద్యోగులే
హైకోర్టు తీర్పు పట్ల ప్రభాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యుత్ శాఖకు ఇది శుభ దినమన్నారు. ఇకపై ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు వారికి పేస్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టి జన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.