బ్రహ్మాండంగా గెలవబోతున్నాం..

KCR Developed Gajwel well said Harish Rao - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ‘గజ్వేల్‌ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్‌ మాత్రం గజ్వేల్‌ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

దేశం మొత్తం గజ్వేల్‌ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్‌.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకుపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. గజ్వేల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్‌ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. 25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య, జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top