వెనక్కి తగ్గిన కత్తి.. కేసు ఉపసంహరణ 

kathi mahesh withdraw the complaint against those attackers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి పోలీసులకు చేసిన ఫిర్యాదును కొద్ది గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. గురువారం ఓ టీవీ చానెల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా అతనిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కత్తి శుక్రవారం మాదపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ అభిమానులే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కత్తిపై తామే దాడి చేశామని హైదరాబాద్‌లోని జగద్గీరిగుట్టకు చెందిన సతీష్‌, నాని అనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. అనంతరం ఓ టీవీ చానెల్‌ డిబెట్‌లో కత్తికి ఈ యువకుల మధ్య సయోధ్య కుదరడంతో ఆయన కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్‌ కత్తి ట్విటర్‌లో తెలిపారు. 

‘నేనున్నది పరిపక్వత లేని పీకే పేద అభిమానులను శిక్షించడం కోసం కాదు. పీకే, జనసేన ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఒక తప్పుదోవ పట్టిన దళితుడు. నేను వారిని శిక్షించటానికి కాకుండా వారిని సంస్కరించుటకు నైతిక బాధ్యత వహిస్తాను. నాపై దాడిని ఖండించడం, క్షమాపణలు చెప్పడం పీకేకే వదిలేస్తున్నాను. అని ట్వీట్‌ చేశారు. 

కొద్దిరోజులుగా పవన్‌ అభిమానులకు కత్తికి సోషల్‌ మీడియా వేదికగా మాటలయుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన అనంతరం దాడి చేసిన వారితో కత్తి సెల్ఫీలు దిగారు. దీంతో ఈ వివాదం తెరపడిందని అటు పవన్‌ ఫ్యాన్స్‌, ఇటు కత్తి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ అభిమానులతో కత్తి మహేశ్‌ సెల్ఫీ( దాడి చేసిన నాని, సతీష్‌ ఎడమ నుంచి )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top