
జగిత్యాల రూరల్: పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం అధికారుల తీరుతో అపహాస్యానికి గురవుతోంది. జగిత్యాల జిల్లాలో పెళ్లి సమయంలో పథకానికి దరఖాస్తు చేయగా.. వారికి పిల్లలు పుట్టిన తర్వాత చెక్కు రావటం.. ఆ దంపతులు తమ పిల్లలతో వచ్చి చెక్కు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం కండ్లపల్లికి చెందిన కత్తి అనూషకు మెట్‌పల్లి మండలం కోనరావుపేటకు చెందిన పుల్ల సాగర్‌తో వివాహం జరిగింది. 16 నెలల క్రితం కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అనూషకు నాలుగు నెలల క్రితం పాప జన్మించింది. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని వారికి సమాచారం అందగా.. తమ పాపతో సహా వచ్చారు. అయితే, లబ్ధిదారులందరికీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేయగా, అనూష దంపతులతో పాటు మరో మూడు జంటలను అధికారులు పక్కకు తీసుకెళ్లి చెక్కులు ఇవ్వటం గమనార్హం. ఆ ముగ్గురూ కూడా పిల్లలతో వచ్చిన వారే కావడం కొసమెరుపు.