జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ | JEE Main ranks On Suspense | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ

Jun 30 2015 1:34 AM | Updated on Sep 3 2017 4:35 AM

జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ

జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ

జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

ర్యాంకుల కోసం 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణ    
24నే వెల్లడించాల్సి ఉన్నా ఇంకా ప్రకటించని సీబీఎస్‌ఈ
ఫలితంగా రెండోసారి మారిన వెబ్ ఆప్షన్ల షెడ్యూల్
♦  నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయన్న జేఓఎస్‌ఏఏ
రెండుసార్లు షెడ్యూల్ మార్పు జేఈఈ చరిత్రలో ఇదే తొలిసారి

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

ర్యాంకుల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నా సీబీఎస్‌ఈ వాటిని ఇంకా ప్రకటించలేదు. వాస్తవానికి ఈనెల 25 నుంచే వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉన్నా ర్యాంకుల విడుదలలో జాప్యం కారణంగా ఆ ప్రక్రియను సోమవారం (29వ తేదీ) నుంచి ప్రారంభిస్తామని ఉమ్మడి ప్రవేశాల కోసం ఏర్పాటైన జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్‌ఏఏ) ఈనెల 24న పేర్కొంది. దీంతో ఆదివారం (28వ తేదీ) అర్ధరాత్రి వరకైనా ర్యాంకులు వెలువడతాయని విద్యార్థులు ఎదురుచూసినా అలా జరగలేదు.

సీబీఎస్‌ఈ ర్యాంకులను ప్రకటించిన రెండు మూడు గంటల తరువాత వెబ్ ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందని జేఓఎస్‌ఏఏ వెబ్‌సైట్‌లో పేర్కొంది. కానీ సోమవారం కూడా మెయిన్ ర్యాంకులు విడుదల కాకపోవడం, సోమవారం సాయంత్రం వరకు కూడా వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెల కొంది. ఎట్టకేలకు సోమవారం రాత్రి వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను జేఓఎస్‌ఏఏ తిరిగి మార్చింది. మంగళవారం (30వ తేదీ) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. ఇలా ప్రవేశాల షెడ్యూలును 2 సార్లు మార్పు చేయడం జేఈఈ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం.
 
జూలై 7న ఫలితాలని తొలుత నోటిఫికేషన్..
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ ఫలితాలను జూలై 7న ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ మొదట్లో తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే ఈసారి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో అన్నింటికీ ఒకేసారి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను ఈనెల 18న ప్రకటించింది. మరోవైపు జేఈఈ మెయిన్ ర్యాంకులను కూడా ఈనెల 24న ప్రకటించాలని తొలుత నిర్ణయించింది.
 
పరీక్ష రాసిన 1.19 లక్షల మంది తెలుగు విద్యార్థులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్ కోసం 1,24,234 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,19,850 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ  రాష్ట్రం నుంచి 69,234 మంది దరఖాస్తు చేసుకోగా 66,596 మంది హాజరయ్యారు. ఆం ధ్రప్రదేశ్ నుంచి 55,000 మంది దరఖాస్తు చేసుకోగా 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement