నెలకో బిల్లు గుండె గుబిల్లు

Issue of electricity bills without seeing the meter - Sakshi

ఒక నెల సున్నా రీడింగ్‌.. మరో నెల వందల యూనిట్ల బిల్లు 

మీటర్‌ చూడకుండానే విద్యుత్‌ బిల్లుల జారీ 

కొన్నిచోట్ల రీడింగ్‌ నమోదులోనూ జాప్యం  

దీంతో స్లాబ్‌రేట్‌ మారి వందలకు వందలు బిల్లు 

లబోదిబోమంటున్న గృహ విద్యుత్‌ వినియోగదారులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇలా చాలా మంది వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మీటర్‌ చూడకుండానే బిల్లు వేయడం లేదా రోజులు పెంచి బిల్లు తీసి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారుడు ఖర్చు చేయని విద్యుత్‌కు కూడా ముందే బిల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 

జాప్యంతో మారుతున్న స్లాబ్‌రేట్‌ 
ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 44,60,150 పైగా గృహ, 6,95,803పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతినెలా నిర్దిష్ట తేదీకే (30 రోజులకు) మీటర్‌ రీడింగ్‌ నమోదు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణాలోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండుమూడు రోజులు ఆలస్యంగా మీటర్‌ రీడింగ్‌ నమోదు చేస్తు న్నారు. స్లాబ్‌రేట్‌ మారిపోయి విద్యుత్‌ బిల్లులు రెట్టింపు స్థాయిలో జారీ అవుతుండటంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. కాగా, విద్యుత్‌ చౌర్యం, లైన్‌లాస్, ఇతర నష్టాలను నెలవారి బిల్లులు చెల్లించే వినియోగదారులపై రుద్దుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్లాబ్‌రేట్‌ మార్చి బిల్లులు రెట్టింపుస్థాయిలో జారీ చేసి వందశాతం రెవెన్యూ కలెక్షన్‌ నమోదైనట్లు రికార్డుల్లో చూపిస్తుండటం కొసమెరుపు. 
- సైదాబాద్‌ వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన ముచ్చా విజయకి  సంబంధించిన గృహ విద్యుత్‌ కనెక్షన్‌ నెలవారీ బిల్లును జూన్‌ 7న జారీ చేశారు. బిల్లుపై ఉన్న ప్రీవియస్‌ కాలంలో (జూన్‌) 30,649 యూనిట్లు రికార్డ్‌ కాగా... జూలై 7న కూడా 30,649 యూనిట్లే రికార్డయింది. నెలలో వాడిన మొత్తం యూనిట్ల సంఖ్య జీరోగా చూపించి, మినిమం బిల్లు రూ.175 వేశారు.  

ఇక ఆగస్టు 7న అదే సర్వీసు నంబర్‌పై మీటర్‌ రీడింగ్‌ తీసి, బిల్లు జారీ చేశారు. ప్రీవియస్, ప్రజెంట్‌ రీడింగ్‌లో మార్పు లేదు. కానీ 206 యూనిట్లు వాడినట్లు చూపించి, రూ.1,116 బిల్లు వేశారు. విజయకి అనుమానం వచ్చి మీటర్‌ను పరిశీలిస్తే.. అసలు విషయం బయటపడింది. మీటర్‌లో ప్రస్తుతం 30,507 యూనిట్లు మాత్రమే నమోదైనట్లు ఉంది.  

ఇక ఇబ్రహీంపట్నంలో సరస్వతికి సంబంధించి బిల్లులో అన్నీ తప్పులే. ప్రీవియస్‌ బిల్లు 8419 ఉంటే, ప్రజెంట్‌ బిల్లు 91 గా చూపించారు. అలాగే 34 రోజులకు బిల్లు తీసి వంద యూనిట్లు దాటేలా చేశారు. దీంతో స్లాబ్‌ మారి బిల్లు అమాంతం పెరిగింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top