సిరియా టు దక్షిణాసియా! 

ISIS Focused On Syria to South Asia - Sakshi

కన్నేసిన ఉగ్ర సంస్థ ఐసిస్‌

ఇస్లామిక్‌ రాజ్య స్థాపన కోసం అంటూ విస్తరణ..

సాక్షి, హైదరాబాద్‌: లష్కరేతోయిబా, తాలిబన్, అల్‌ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతున్న సంస్థే ఐసిస్‌. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌), ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్‌ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం.

తాజాగా భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేసి ప్రత్యేక దేశంగా చేయాలంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ (ఐఎస్‌జేకే) పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఈ విభాగంతో సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల దేశాల్లో కార్యకలాపాలకు ఇస్లామిక్‌ స్టేట్‌ అరబ్‌ పెనిన్సులా (ఐఎస్‌ఏపీ), దక్షిణాసియా లో ఆపరేషన్స్‌ కోసం పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లోని ఖురాసాన్‌ కేంద్రంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐసిస్‌ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ, భారత్‌ వ్యవహారాల చీఫ్‌ షఫీ ఆర్మర్‌ మృతి తర్వాత విభాగాల వారీగా నేతలు తయారయ్యారు.  

దక్షిణాసియా లక్ష్యంగా.. 
ఐసిస్‌ ఖురాసాన్‌ మాడ్యూల్స్‌ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి. కేవలం పాక్, బంగ్లాదేశ్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్‌ ప్రయత్నించింది. ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన. భారత్‌లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్‌ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు. మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్‌ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది. కానీ, తాజాగా శ్రీలంకలో వారి ప్రయత్నం సఫలమైంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top