‘తెయూ’ నియామకాలపై విచారణ | inquiry on telangana recruitment | Sakshi
Sakshi News home page

‘తెయూ’ నియామకాలపై విచారణ

May 31 2014 2:47 AM | Updated on Sep 2 2017 8:05 AM

తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీవీ రాములు శుక్రవారం రెండో విడత విచారణ జరిపారు.

తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి  వీసీ అక్బర్‌అలీఖాన్‌పై  వెల్లువెత్తిన ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీవీ రాములు శుక్రవారం రెండో విడత విచారణ జరిపారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గత నెల 11న హైకోర్టు రిటైర్ట్ జడ్జి సీవీ రాములు తో విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. విచారణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19, 20వ తేదీల్లో  తెయూను సందర్శించిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాములు తొలి విడతలో రెండు రోజుల పాటు విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే.

 శుక్రవారం ఉదయం తెయూ పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి చాంబర్‌లో రహస్యంగా విచారణ నిర్వహించారు. కేవలం విచారణ కమిటీకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులను, ఆరోపణలు  ఎదుర్కొంటున్న వీసీ అక్బర్‌అలీఖాన్, మాజీ రిజిస్ట్రార్ అశోక్, ప్రస్తుత రిజిస్ట్రార్ లింబాద్రితో పాటు ఇతర అధ్యాపకులను విడివిడిగా విచారణ జరిపారు.

 తొలి విడతలో నియామకాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడంతో పాటు  వీసీ అక్బర్‌అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలను నియామకాల విషయమై ప్రశ్నించిన విషయం తెలిసిందే.  ఈ సారి కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేసిన అకడమిక్ కన్సల్టెంట్లు(ఏసీలు) వెంకటగిరి, వెంకట్‌నాయక్, నారాయణ ల వాదనలు విన్న రిటైర్డ్ జడ్జి  వివరాలు నమోదు చేసుకున్నారు. తొలగించిన   అప్లయిడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (ఇంటిగ్రేటెడ్ కోర్సులు) కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్‌లో పోస్టులు ప్రకటించడంతో రోస్టర్ పాయింట్ మారి పోయి పలువురికి అన్యాయం జరిగిందని వారు రిటైర్డ్ జడ్జికి వివరించారు.

అలాగే హైకోర్టులో తాము వేసిన కేసును ఉపసంహరించుకోవాలని  ఒత్తిడి తెచ్చారని ఏసీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుత ప్రిన్సిపాల్ కనకయ్యను విచారించి ఆయన సమాధానాలను నమోదు చేసుకున్నారు.  నియామక  ప్రక్రియలో అర్హతలు ఉన్నా తమను అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు బదులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంపిక చేశారని కమిటీకి ఫిర్యాదు చేసిన ప్రభంజన్‌రావు(మాస్ కమ్యూనికేషన్స్), వెంకటేశ్వర్లు(ఎకనామిక్స్), కైసర్ మహ్మద్(మేనేజ్‌మెంట్) తదితరులు రిటైర్ట్ జడ్డి ఎదుట తమ వాదనలు విన్పించారు.

  నియామకాల విషయాలపై ప్రభుత్వం గతంలో నియమించిన ద్విసభ్య కమిటీ నివేదికలో తప్పు పట్టిన అంశాలపై వీసీతో పాటు మాజీ రిజిస్ట్రార్ అశోక్‌ను రిటైర్డ్ జడ్జి పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. నియామకాలపై అకడమిక్ కన్సల్టెంట్‌లు  హైకోర్టులో వేసిన కేసు, కోర్టు మధ్యంతర తీర్పు వివరాల గురించి వీసీ, రిజిస్ట్రార్‌లను ప్రశ్నించి, వారి వివరణలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వచ్చే జూలై 14న వీసీ అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆలోపే విచారణ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement