హెల్మెట్‌ ఫస్ట్‌.. మిర్రర్‌ మస్ట్‌!

Hyderabad Police Awareness Without Helmet And Side Mirror Challans - Sakshi

పిలియన్‌ రైడర్లకు హెల్మెట్‌ లేకపోవడంతోనే మరణాలు   

పేట్‌బషీరాబాద్, మేడ్చల్, బాచుపల్లి ప్రమాదాలే ఉదాహరణ  

మరో ఘటనలో బైక్‌కు సైడ్‌మిర్రర్‌ ఉండకపోవడంతో ప్రమాదం

మూడు నెలలుగా సైబరాబాద్‌లో 6,09,164 ఈ– చలాన్లు

ప్రజల భద్రతలో భాగంగానే అంటున్న ట్రాఫిక్‌ పోలీసులు

వాహనదారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని సూచనలు

సాక్షి, సిటీబ్యూరో: పై మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు పిలియన్‌ రైడర్లు (మహిళలు) హెల్మెట్‌ ధరించకపోవడంతోనే మృతి చెందారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఎందుకంటే హెల్మెట్లు ధరించిన రైడర్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. పేట్‌బషీరాబాద్, మేడ్చల్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో హెల్మెట్లు ధరించకపోవడంతో పాటు ఆయా ద్విచక్ర వాహనాలకు సైడ్‌ మిర్రర్‌ లేకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ సైడ్‌మిర్రర్‌ ఉండి ఉంటే ఆయా భారీ వాహనాల కదలికలను గుర్తించి ఉంటే ఈ ప్రమాదాలు జరగకపోయి ఉండొచ్చన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వందల సంఖ్యలో జరుగుతుండటాన్ని గమనించిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఉల్లంఘనుల వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి నెల నుంచి హెల్మెట్‌ లేని పిలియన్‌ రైడర్లకు, సైడ్‌ మిర్రర్‌ లేని వాహనాలకు ఈ– చలాన్లు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనైతే  ఈ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగానే కొరడా ఝుళిపించారు. కేవలం మూడు నెలల్లోనే హెల్మెట్‌ లేని పిలియన్‌ రైడర్‌ కేసులు 4,59,280, మిర్రర్‌ లేని వాహనాలకు 1,49,884 చలాన్లు విధించారు. ఇలా మొత్తం 6,09,164 ఈ– చలాన్లు జారీ చేశారు.  (డబుల్స్‌ వస్తే రూ.500 జరిమానా)

ప్రజల భద్రత కోసమే..  
‘ఎంవీ చట్టం 129 సెక్షన్‌ ప్రకారం నాలుగేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారూ పిలియన్‌ రైడర్‌గా ఉంటేæ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్స్‌ లేకుండా చాలా ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు. మలుపు తీసుకునేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అధిగమించేటప్పుడు, రోడ్లపై సందులను మార్చేటప్పుడు వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రైడర్‌ గమనించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రహదారి భద్రత దృష్ట్యా కొన్ని నెలల నుంచి ఈ ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామ’ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.  

మార్చి నెల నుంచిఈ– చలాన్లు ఇలా..
హెల్మెట్‌ పిలియన్‌ రైడర్‌ కేసులు:4,59,280
మిర్రర్‌ కేసులు: 1,49,884
మొత్తం: 6,09,164
ఈ‘పేట్‌బషీరాబాద్, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో బైక్‌ వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు (పిలియన్‌ రైడర్లు) మృతి చెందారు. భారీ వాహనాలు వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో రెండు బైక్‌లపై ఉన్న ముగ్గురు పిలియన్‌ రైడర్ల తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లో బైక్‌ రైడ్‌ చేస్తున్నవారు హెల్మెట్లు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.’ఈ ‘బాచుపల్లిలో భారీ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఓ బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో పిలియన్‌ రైడరైన మహిళ దుర్మరణం చెందారు. హెల్మెట్‌ ధరించిన రైడర్‌ ప్రాణాలతో బయటపడ్డారు’.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top