డబుల్స్‌ వస్తే రూ.500 జరిమానా

E Challan For Doubles on Two Wheeler in Tamil nadu - Sakshi

వాహనాల్లో ఓవర్‌ లోడింగ్‌పై దృష్టి

ప్రమాదాల నివారణకు చర్యలు

రెండు నెలల్లో 262 మరణాలు

సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు పయనించేందుకు నిషేధం విధించారు. డబుల్స్‌తో చక్కర్లు కొడితే రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో ఓవర్‌ లోడింగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక లాక్‌డౌన్‌కాలంలోనూ రాష్ట్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మార్చి 24న లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదో విడతగా లాక్‌డౌన్‌ పొడిగింపు కొనసాగుతోంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల మినహా, తక్కిన అన్ని చోట్ల సడలింపులు ఎక్కువే. చెన్నైలో కేసులు అమాంతంగా పెరగుతుండడంతో టెన్షన్‌ తప్పడం లేదు. దీంతో ఇక్కడ ఆంక్షల్ని మరింత కఠినం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సడలింపు పుణ్యమాని, రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసి ఉన్నాయి.

డబుల్స్, త్రిబుల్స్‌ అంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. అలాగే, కార్లలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు పయనించేందుకు అవకాశం కల్పించినా, అంతకన్నా ఎక్కువగానే అనేక చోట్ల ప్రయాణిస్తున్నారు. ఇలా ఎక్కువమందితో పయనిస్తున్న వాహనాల భరతం పట్టేందుకు గురువారం నుంచి పోలీసులు దూకుడు పెంచనున్నారు.ద్విచక్ర వాహనల్లో ఒకరు మాత్రమే పయనించాలన్న ఆంక్షను విధించారు. డబుల్స్‌తో ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో అధిక శాతం మంది ఉంటే, సంఖ్యను బట్టి తలా రూ. 500 జరిమానా వడ్డించబోతున్నారు. ఆటోలు, కార్లకు అనుమతి ఇచ్చినప్పుడు తమకు సైతం అనుమతి ఇవ్వాలని కోరుతూ షేర్‌ ఆటోడ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. 

ప్రమాదాలు..
లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్డెక్కిన వాళ్లు ఎక్కువే. వీరిపై కేసులు వి«ధించినా, జరిమానాల వడ్డన మోగించినా ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఈ కాలంలోనూ ప్రమాదాలు తప్పలేదు. జవనరిలో రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 731 మంది, ఫిబ్రవరిలో 232 మంది, మార్చిలో 610 మంది మరణించారు. లాక్‌ అమల్లోకి వచ్చినానంతరం ఏప్రిల్‌లో 119 మంది, మేలో 143 మంది ప్రమాదాల్లో మరణించినట్టు గణాంకాలు తేల్చాయి. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top