గంటన్నరలో హైదరాబాద్‌కు..

Hyderabad To Mahabubnagar Railway Double Lane Works Speedup - Sakshi

డబ్లింగ్‌ పనులు పూర్తయితే తీరనున్న జిల్లావాసుల కష్టాలు

డిసెంబర్‌కల్లా సాకారంకానున్న కల ఎంపీ జితేందర్‌రెడ్డి

డబుల్‌లైన్‌ పనులను పరిశీలించిన ఎంపీ,ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌

రాజాపూర్‌ (జడ్చర్ల): హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు జరుగుతున్న డబుల్‌ రైల్వే లైన్‌ పనులు పూర్తయితే గంటన్నరలో హైదరాబాద్‌ చేరుకోవచ్చని.. దీంతో వ్యాపారస్తులు, ఉద్యోగులకు సమయం కలిసొస్తుందని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు జితేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని దివిటిపల్లి గ్రామం నుండి రాజాపూర్‌ వరకు జరుగుతున్న రైల్వే లైన్‌ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ట్రాలీపై వెళ్తూ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాజాపూర్‌ మండల కేంద్రంలో అండర్‌ బ్రిడ్జి పనులు కొందరు రైతులు అడ్డుకున్నారని రైల్వే సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకురాగా.. స్థానికులతో చర్చించాలని జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌తో కూడా చర్చిస్తామని ఆయన అధికారులకు తెలిపారు.

నిధుల కొరత లేదు..
డబుల్‌ లైన్‌ పనులు పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీ జితేందర్‌రెడ్డి ఆ తర్వాత రాజాపూర్‌లోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల చిరకాల కోరిక వచ్చే డిసెంబర్‌ నాటికి కలసాకారం కానుందని ఎంపీ చెప్పారు. రూ.1,207 కోట్ల నిధులు రైల్వే డబ్లింగ్‌ పనులు, విద్యుద్ధీకరణకు మంజూరయ్యాయన్నారు. మొత్తం 100 కిలోమీటర్ల రైల్వే లైన్‌లో 25 కిలోమీటర్ల లైన్‌ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి డెమో రైలు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ లైన్‌లో 154 చిన్న బ్రిడ్జిలు, 9 పెద్ద బ్రిడ్జిల పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్‌ లైన్‌ పనులు ఎంపీ జితేందర్‌రెడ్డి ఫ్లోర్‌లీడర్‌గా ఉండడంతో వేగంగా జరుగుతున్నాయన్నారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్‌ పక్కనే ఐటీ కారిడార్, మల్టిపుల్‌ పరిశ్రమలు వస్తున్నందున ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా ఏర్పాటు చేస్తూ మోడ్రన్‌ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌తోపాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కృష్ణారెడ్డి   తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top