ప్రగతి నివేదన సభకు అనుమతి రాజ్యాంగ విరుద్ధం

Hyderabad High Court to hear plea against TRS government meet today - Sakshi

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన పూజారి శ్రీధర్‌

1,600 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారని నివేదన

నేడు విచారించనున్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ పేరు తో సెప్టెంబర్‌ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్‌ వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సభకిచ్చిన అనుమతులను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల్‌ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.

సభ పేరిట 25లక్షల మందిని ఒకచోట చేర్చే బదులు తమ పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను తెలియచేసేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకునేలా టీఆర్‌ఎస్‌ను ఆదేశించాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్‌ రామ సుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది శశికిరణ్‌ ప్రస్తావించారు.

కేసు ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ప్రగతి నివేదన సభ కోసం 1600 ఎకరాలను చదును చేస్తున్నారని, ఇందులో ఉన్న చెట్లన్నింటినీ నరికేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఈ సభకు 25 లక్షల జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, దాదాపు లక్ష వాహనాలను వినియోగించనున్నారన్నా రు.

ఈ సభ వల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న సభ లక్ష్యం ప్రభుత్వం ఘన విజయాలను ప్రజలకు తెలియచేయడమేనన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్‌ మీడియా వంటి సాధానాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సభ వల్ల పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానిని టీఆర్‌ఎస్‌ నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top