నిజాయతీ ఇంకొంచెం పెరగాలోయ్‌!

Hyderabad In 7th Place In Honest Index - Sakshi

నిజాయతీలో ఏడో స్థానంలో హైదరాబాద్‌

దేశంలోని ఏడు నగరాలపై అంతర్జాతీయ సంస్థ అధ్యయనం

మొదటి స్థానంలో బెంగళూరు, రెండో స్థానంలో కోయంబత్తూర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘విక్రమ్‌ తన ఇంటి సమీపంలో ఉన్న పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారు. అక్కడ తనకు ఓ పర్సు కనిపించింది. అందులో డబ్బులు.. క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. అక్కడ వాకర్స్‌ను వాకబు చేసినా తమది కాదని చెప్పేశారు. ఆ పర్సును తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పి తన నిజాయతీని చాటు కున్నాడు’ఈ విషయంలో మన హైదరాబాద్‌ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఎందు కంటే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పౌర నిజాయతీపై ఓ అంతర్జాతీయ సంస్థ జరి పిన అధ్యయనంలో హైదరాబాద్‌ చివరి స్థానం(7)లో ఉంది. పార్కులు, బహి రంగ ప్రదేశాలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బ్యాం కులు, ప్రజోపయోగ ప్రభుత్వ, ప్రైవేటు కార్యా లయాల వద్ద దొరికిన వస్తువులను కంటికి రెప్పలా కాపాడి.. అపరిచితులకు చెందిన వస్తువులు దొరికితే నిజాయతీగా పోలీసులకు అప్పజెబుతున్న వారిపై ‘గ్లోబల్‌ రీసెర్చ్‌ ఇనిషి యేటివ్‌’అనే సంస్థ తాజాగా ఓ అధ్యయనం నిర్వహించింది.

విశ్వవ్యాప్తంగా 30 దేశాల్లోని 355 నగరాలపై ఈ సంస్థ పరిశోధక బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఈ విషయంలో డెన్మార్క్‌ దేశం 82% పౌర నిజాయతీతో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ఏడు ప్రధాన నగరాలపై ఈ అధ్యయనం జరపగా.. బెంగళూరు 66.7% స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కోయంబత్తూర్‌ (57.1%), మూడో స్థానంలో కోల్‌కతా (46.7%), నాలుగో స్థానంలో ఢిల్లీ (43.8%) ఐదోస్థానంలో అహ్మదాబాద్‌ (40%) ఉన్నాయి. ఇక రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ 38.5 శాతంతో ఆరోస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో హైదరాబాద్‌ (28.6 శాతం) ఉంది. మన సిటీలో ఈ విషయం మరింత పురోగతి సాధించాల్సిన అవసరముందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, పార్కుల్లో విలువైన వస్తువులను పలువురు ఆటోడ్రైవర్లు, నగర పౌరులు తమకు జాగ్రత్తగా అప్పజెబుతూ నిజాయితీ చాటుకుంటున్నారని సిటీ పోలీసులు చెబుతున్నారు.

మహిళల్లోనే నిజాయితీ అత్యధికం..
పౌరనిజాయితీ విషయంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే పురుషుల కంటే మహిళలే అత్యంత నిజాయితీగా ఉన్నారట. 56.4 శాతం మంది మహిళలు నిజాయితీపరులు ఉండగా.. పురుషుల్లో 40.6 శాతం మాత్రమే నిజాయితీ పరులున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అన్ని అంశాలు కాకపోయినా.. కనీసం బహిరంగ ప్రదేశాల్లో తమ కంటపడిన విలువైన వస్తువులను జాగ్రత్తగా పోలీసులకు అప్పజెబుతున్న వారి శాతం ఇటీవల పెరుగుతుండటంపై సామాజిక శాస్త్రవేత్తలు, పోలీసులు గొప్ప విషయంగా అభివర్ణిస్తుండడం విశేషం.

నగదుకు ఆశపడని నిజాయితీ పరులు..
మెట్రో నగరాల్లో క్షణం తీరకలేకుండా బిజీగా గడిపే సిటీజన్లు తరచూ.. తమ ల్యాప్‌టాప్‌లు, పర్సులు, బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇందులో అత్యధికంగా పర్సులే ఉంటున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఇక పౌరనిజాయితీ విషయానికి వస్తే పర్సుల్లో వేల రూపాయలు.. క్రెడిట్, డెబిట్‌ కార్డులున్నప్పటికీ నిజాయితీపరులు వాటివైపు కన్నెత్తిచూడకుండా యథావిధిగా ఆయా పర్సులను పోలీసులకు అప్పజెబుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.
పౌరనిజాయితీలో దేశంలోని నగరాల పరిస్థితి..

నగరం           స్థానం       పౌరనిజాయితీ శాతంలో
బెంగళూరు        1            66.7
కోయంబత్తూర్‌    2            57.1
కోల్‌కతా           3             46.7
ఢిల్లీ                 4            43.8
అహ్మదాబాద్‌    5             40
జైపూర్‌            6            38.5
హైదరాబాద్‌       7          28.6

పౌరనిజాయితీలో టాప్‌ 5 దేశాలు..
దేశం            నిజాయితీ శాతం
డెన్మార్క్‌            82
స్వీడన్‌             81.5
న్యూజిల్యాండ్‌      80
స్విట్జర్లాండ్‌          79
నార్వే               78.7 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top