అదే మెట్రో.. అదే జోష్‌

Hyd people are enjoing metro - Sakshi

     మెట్రో జాయ్‌ రైడ్స్‌తో హైదరాబాదీల ఎంజాయ్‌

     సకుటుంబ సపరివార సమేతంగా ప్రయాణాలు

     ఆదివారం రెండు లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య

     అమీర్‌పేట్‌లో బాంబు కలకలం.. ఉట్టిదే అని తేల్చిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌.. అమీర్‌పేట్‌.. నాగోల్‌.. ఏ స్టేషన్‌ చూసినా ఇసుకేస్తే రాలనట్టుగా జనం.. ఇక మెట్రో రైళ్ల సంగతి సరే సరి.. రైలులోకి ఎక్కేందుకు.. దిగేందుకు కూడా ఖాళీ లేనంతగా కిక్కిరిసిన బోగీలు.. ఇదీ ఆదివారం నగరంలో మెట్రో జోష్‌. సెలవురోజు కావడంతో హైదరాబాదీలు సకుటుంబ సపరి వారసమేతంగా మెట్రోలో జాయ్‌ రైడ్‌ చేసి ఆనందించారు. దీంతో నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలోని 24 మెట్రో స్టేషన్లు.. ప్రతి 10–15 నిమిషాలకు ఒకటి చొప్పున పరుగులు తీసిన మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. మెట్రో ప్రారంభమైన తర్వాత ఇదే తొలి ఆదివారం కావడంతో చిన్నారులు తల్లిదండ్రులతో కలసి మెట్రో జర్నీ చేశారు. ఎలివేటెడ్‌ మార్గంలో ప్రయాణిస్తూ నగర అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

ఇక ప్రయాణీకుల రద్దీ వల్ల మెట్రో స్టేషన్లలోని టికెట్‌ విక్రయ యంత్రాలు, కౌంటర్ల వద్ద జనం బారులుతీరారు. స్టేషన్లలో మంచినీటి వసతి లేకపోవడం, రద్దీకి అనుగుణంగా టాయిలెట్స్‌ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఇక కార్లు, ద్విచక్రవాహనాలపై మెట్రో స్టేషన్లకు వచ్చిన వారు పార్కింగ్‌ కోసం తిప్పలు పడ్డారు. మొత్తం 24 స్టేషన్లకుగానూ ఐదు చోట్లే పార్కింగ్‌ సదుపాయం ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ ఫీడర్‌ బస్సులు నడుపుతామని అధికారులు చెప్పినా ఇప్పటికీ వాటి జాడ లేదు. ఇక మియాపూర్‌ స్టేషన్‌ ఆవరణలో ఉన్న సైకిల్‌ స్టేషన్‌లో రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.

సెల్ఫీస్పాట్‌.. మియాపూర్‌..
మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సెల్ఫీస్పాట్‌గా మారింది. స్టేషన్‌ పరిసరాల్లో ప్రధాని మోదీ ప్రారంభించిన పైలాన్‌ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి యువత ఉత్సాహం చూపించింది. ప్రయాణికులు తమ వాహనాలను స్టేషన్‌ ఆవరణలోని ఫుట్‌పాత్‌పైనే వదిలివెళ్తున్నారు. ఆదివారం ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హెలిప్యాడ్‌ నిర్మించిన ప్రాంతంలో వాహనాలు నిలిపేందుకు వీలుకల్పించారు.

అమీర్‌పేట్‌లో బాంబు కలకలం..
అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సోదాలు నిర్వహించారు. స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించారు. బ్యాగ్‌ను సోదా చేయగా అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ బ్యాగ్‌ మెట్రో స్టేషన్‌ సెక్యూరిటీ సిబ్బందికి చెందినదిగా గుర్తించి వారికి అప్పగించారు. కాగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యేలా ప్రసారం చేసిన వార్తలను మెట్రో అధికారులు ఖండించారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవుపలికారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top