కుటుంబకలహాలతో భర్త గొడ్డలితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించగా కొడుకు అడ్డుకున్నాడు.
బైంసా (ఆదిలాబాద్ జిల్లా) : కుటుంబకలహాలతో భర్త గొడ్డలితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించగా కొడుకు అడ్డుకున్నాడు. దీంతో తండ్రి ఆవేశంతో కొడుకును నరికి అనంతరం భార్యపై దాడి చేసి, తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా బైంసా మండలం గుండెగాం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... గుండెగాం గ్రామానికి చెందిన దాదారావు(45)కు భార్య సవిత(40), కుమారుడు మారుతి(12), కుమార్తె సోని(10) ఉన్నారు.
కాగా శనివారం రాత్రి దాదారావు.. భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే అతను భార్యపై గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన కొడుకు మారుతి అడ్డుకున్నాడు. ఆవేశంలో ఉన్న తండ్రి.. కొడుకుపై గొడ్డలితో దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం భార్యను సైతం గొడ్డలితో నరికి, తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న సవితను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పదేళ్ల సోని శనివారం రాత్రి పక్కనే ఉన్న నానమ్మ ఇంటిలో నిద్రపోయేందుకు వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.