breaking news
attack with axe
-
తాళ్లతో కట్టేసి.. గొడ్డలితో నరికి..
► బర్దిపూర్లో దారుణం ► అక్రమ సంబంధం అనుమానంతో గొడ్డలితో దాడి ► ఇంట్లో తాళ్లతో కట్టెసి కాలు, చేయి నరికేసిన వైనం ► ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న క్షతగాత్రుడు టేక్మాల్: అక్రమ సంబంధమనే అనుమానంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి సంభవించింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త ఓ వ్యక్తిని ఇంట్లోకి లాక్కెళ్లి తాళ్లతో కట్టేశాడు. గొడ్డలితో దాడి చేసి కాలు, చేయి నరికివేయడంతోపాటు కన్ను, శరీర భాగాలపై గొడ్డలితో వేటు వేసి హత్యాయత్నం చేశాడు. దీంతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఐ ఎల్లాగౌడ్, స్థానికుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బంటు రవి(35) వ్యవసాయంతోపాటు, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామంలో జరుగుతున్న భజనలో పాల్గొని వెళుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మేకల కిష్టయ్య తన భార్యతో రవికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోపాటు, పాత కక్షల కారణంగా పథకం పన్నాడు. ఈ క్రమంలో రవిని తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న రవిని ఇంట్లోనే తాళ్లతో కట్టేశాడు. కట్టెసిన రవిపై కిష్టయ్య తన ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేసి కాలు, చేయి నరికి వేశాడు. అంతేకాకుండా తలపై, ఎడమ కన్నుపై, వీపు భాగంలో బలంగా గొడ్డలితో వేటువేశాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న రవి బాధను తట్టుకోలేక కేకలు వేశాడు. అనంతరం కిష్టయ్యే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి ఎస్ఐ ఎల్లాగౌడ్, సిబ్బంది వెళ్లారు. విచారణ జరుపుతూ క్షతగాత్రుడైన రవిని 108వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా రవి కాలును పూర్తి తొలగించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రవిని పోలీసులు విచారించగా కిష్టయ్య తనపై గొడ్డలితో దాడి చేశాడని తెలిపాడు. బాధితుడు రవి అన్న కుమారుడు బంటు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రవి భార్య మంజుల, కూతురు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి అంజమ్మ ఉంది. సోమవారం గ్రామంలో పోలీసులు కలియ తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. భయం గుప్పిట్లో బర్దిపూర్ బంటు రవిపై దారుణంగా గొడ్డలితో దాడి చేయడంతో బర్దిపూర్ భయం గుప్పిట్లో మగ్గుతోంది. పన్నెండేళ్ల క్రితం జరిగిన పలు హత్యలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తిరిగి అదేవిధంగా గ్రామంలో అలజడులు ఆరంభమయ్యాయని, ఎప్పుడు ఏవిధంగా ప్రమాదం జరుగుతుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రవిపై దాడి చేయడం కిష్టయ్య ఒక్కడితోనే కాకుండా పలువురు సహకరించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ సమయంలోనే బయటకు వచ్చారు తప్ప మిగతా సమయాల్లో గ్రామాల్లోని ప్రధాన కూడలి సైతం నిర్మానుష్యమైంది. స్థానిక పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. -
బైంసాలో దారుణం
బైంసా (ఆదిలాబాద్ జిల్లా) : కుటుంబకలహాలతో భర్త గొడ్డలితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించగా కొడుకు అడ్డుకున్నాడు. దీంతో తండ్రి ఆవేశంతో కొడుకును నరికి అనంతరం భార్యపై దాడి చేసి, తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా బైంసా మండలం గుండెగాం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... గుండెగాం గ్రామానికి చెందిన దాదారావు(45)కు భార్య సవిత(40), కుమారుడు మారుతి(12), కుమార్తె సోని(10) ఉన్నారు. కాగా శనివారం రాత్రి దాదారావు.. భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే అతను భార్యపై గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన కొడుకు మారుతి అడ్డుకున్నాడు. ఆవేశంలో ఉన్న తండ్రి.. కొడుకుపై గొడ్డలితో దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం భార్యను సైతం గొడ్డలితో నరికి, తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న సవితను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పదేళ్ల సోని శనివారం రాత్రి పక్కనే ఉన్న నానమ్మ ఇంటిలో నిద్రపోయేందుకు వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. -
ఉన్మాది చేతిలో మహిళ హతం
చీరాల టౌన్(ప్రకాశం): ఉన్మాది గొడ్డలితో ఒక మహిళను కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని వడ్డె నాగేశ్వరరావునగర్లో సోమవారం రాత్రి 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భర్త నుంచి విడాకులు తీసుకొని తల్లితో కలిసి ఉంటున్న పిచ్చుల మల్లిక(33)ను పక్కింటికి చెందిన కన్నెమ్రెడ్డి వెంకటేశ్వర్లు(అలియాస్ చిన్నా) గొడ్డలితో నరికి చంపాడు. జులాయిగా తిరిగే చిన్నా మల్లికతో చిన్నచిన్న తగాదాలు పెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిండి రుబ్బుతున్న మల్లికపై వెనుక నుంచి వచ్చి దాడి చేసి హతం చేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు మల్లికకు పదేళ్ల కుమార్తె ఉంది.