తాళ్లతో కట్టేసి.. గొడ్డలితో నరికి.. | attack with axe in medak | Sakshi
Sakshi News home page

తాళ్లతో కట్టేసి.. గొడ్డలితో నరికి..

Mar 28 2017 1:40 PM | Updated on Nov 6 2018 8:50 PM

ఓ వ్యక్తిని తాళ్లతో కట్టేసి గొడ్డలితో దాటి చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.

► బర్దిపూర్‌లో దారుణం
► అక్రమ సంబంధం అనుమానంతో గొడ్డలితో దాడి
► ఇంట్లో తాళ్లతో కట్టెసి కాలు, చేయి నరికేసిన వైనం
► ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న క్షతగాత్రుడు

టేక్మాల్: అక్రమ సంబంధమనే అనుమానంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని బర్దిపూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి సంభవించింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త ఓ వ్యక్తిని ఇంట్లోకి లాక్కెళ్లి తాళ్లతో కట్టేశాడు. గొడ్డలితో దాడి చేసి కాలు, చేయి నరికివేయడంతోపాటు కన్ను, శరీర భాగాలపై గొడ్డలితో వేటు వేసి హత్యాయత్నం చేశాడు. దీంతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక ఎస్‌ఐ ఎల్లాగౌడ్, స్థానికుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బర్దిపూర్‌ గ్రామానికి చెందిన బంటు రవి(35) వ్యవసాయంతోపాటు, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామంలో జరుగుతున్న భజనలో పాల్గొని వెళుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మేకల కిష్టయ్య తన భార్యతో రవికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోపాటు, పాత కక్షల కారణంగా పథకం పన్నాడు. ఈ క్రమంలో రవిని తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న రవిని ఇంట్లోనే తాళ్లతో కట్టేశాడు. కట్టెసిన రవిపై కిష్టయ్య తన ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేసి కాలు, చేయి నరికి వేశాడు. అంతేకాకుండా తలపై, ఎడమ కన్నుపై, వీపు భాగంలో బలంగా గొడ్డలితో వేటువేశాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న రవి బాధను తట్టుకోలేక కేకలు వేశాడు.

అనంతరం కిష్టయ్యే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి ఎస్‌ఐ ఎల్లాగౌడ్, సిబ్బంది వెళ్లారు. విచారణ జరుపుతూ క్షతగాత్రుడైన రవిని 108వాహనంలో మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా రవి కాలును పూర్తి తొలగించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రవిని పోలీసులు విచారించగా కిష్టయ్య తనపై గొడ్డలితో దాడి చేశాడని తెలిపాడు.

బాధితుడు రవి అన్న కుమారుడు బంటు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రవి భార్య మంజుల, కూతురు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి అంజమ్మ ఉంది. సోమవారం గ్రామంలో పోలీసులు కలియ తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
భయం గుప్పిట్లో బర్దిపూర్‌
బంటు రవిపై దారుణంగా గొడ్డలితో దాడి చేయడంతో బర్దిపూర్‌ భయం గుప్పిట్లో మగ్గుతోంది. పన్నెండేళ్ల క్రితం జరిగిన పలు హత్యలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తిరిగి అదేవిధంగా గ్రామంలో అలజడులు ఆరంభమయ్యాయని, ఎప్పుడు ఏవిధంగా ప్రమాదం జరుగుతుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రవిపై దాడి చేయడం కిష్టయ్య ఒక్కడితోనే కాకుండా పలువురు సహకరించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ సమయంలోనే బయటకు వచ్చారు తప్ప మిగతా సమయాల్లో గ్రామాల్లోని ప్రధాన కూడలి సైతం నిర్మానుష్యమైంది. స్థానిక పోలీసులు గ్రామంలో పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement