న్యాల్‌కల్‌ రోడ్డులో భారీ చోరీ

Huge Theft on Nyalkal Road in Nizamabad - Sakshi

16 తులాల బంగారం, రూ. 50 వేల అపహరణ

మహారాష్ట్ర ముఠాగా అనుమానం

నిజామాబాద్‌అర్బన్‌: న్యాల్‌కల్‌ రోడ్డులోని లలితానగర్‌లో సోమవారం ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంటి యాజమని తిమ్మయ్య, లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి వేళ ఆరుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరు దొంగలు లక్ష్మి వద్ద, నలుగురు దొంగలు తిమ్మయ్య వద్దకు వచ్చి కత్తులతో బెదిరించారు. ఇంట్లో బీరువా తాళాలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని భయపెట్టారు. గత్యంతరం లేక వారు దొంగలకు తాళాలు ఇచ్చారు. దీంతో దొంగలు ఇంట్లోని 16 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. పిల్లల వద్ద ఉన్న బంగారం చైన్‌ ఇవ్వకపోతే తిమ్మయ్యపై దుప్పటి వేసి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారు కూడా బంగారు చైన్లు ఇచ్చేశారు.

దొంగలు పారిపోతూ ఇంట్లోని వారిని గదిలో బంధించి వెళ్లిపోయారు. అనంతరం కిటిలో నుంచి చుట్టుపక్కల వారిని పిలిచి గది తలుపులు తీయించుకున్నట్లు వారు తెలిపారు. వారు వెంటనే 5 టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం సీపీ కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఎస్సై జానరెడ్డిలు కూడా ఇంటిని పరిశీలించారు. దొంగలు డ్రాయర్లు, బనియన్లు ధరించి ఉన్నారని ఇంటివారు పోలీసులకు వివరించారు. ఇది మహారాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top