నిర్లక్యం ఖరీదు!

Huge RTC Bus Accident killed 57 people In Kondagattu Ghat Road - Sakshi

గాల్లో కలిసిన 57 ప్రాణాలు

కొండగట్టు ప్రమాదంతో బయటపడుతున్న ఆర్టీసీ వైఫల్యాలు

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, డబ్బతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట గ్రామాలు కొండగట్టు పుణ్యక్షేత్రానికి శివారులో ఉంటాయి. ఈ గ్రామాలకు గత కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. పది రోజులకు ముందు వరకు ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు మీదుగా కాకుండా, జేఎన్‌టీయూ, నాచుపల్లి మీదుగా నడిపించేవారు. పది రోజులుగా ఆర్టీసీ అధికారులు రూట్‌ మార్చారు. ఒక మార్గంలో వెళ్లి మరో మార్గంలో వచ్చేలా రూపొందించారు. గ్రామాలకు వెళ్లేటప్పుడు జేఎన్‌టీయూ, నాచుపల్లి, పూడూర్, దొంగలమర్రి మీదుగా వెళ్తుంది. వచ్చేటప్పుడు జగిత్యాలకు వెళ్లే రూట్‌లోనే కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్‌ రోడ్డు మీదుగా నడుపుతున్నారు. ఘాట్‌ రోడ్డు పక్కనే లోయలు ఉండటంతో బస్సును నడిపించవద్దని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. కానీ ఆర్టీసీ అధికారులు ఘాట్‌ రోడ్డుపై నుంచి బస్సు నడపడం, అది ప్రమాదానికి గురికావడంతో అమాయకులు మృత్యువాత పడ్డారు.  
 
సాక్షి, హైదరాబాద్‌: ఉగ్రవాదం కంటే ఘోరం.. ఉన్మాదం కన్నా దారుణం.. ఊచకోత కంటే భయానకం.. అదే నిర్లక్ష్యం.. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టుపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి కారణం ముమ్మాటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే. సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించి ఘాట్‌ రోడ్డు గుండా తీసుకురావడమే ప్రమాదానికి ప్రధాన కారణం. 70 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం జరిగిపోయింది. ఏకంగా 57 మందిని పొట్టనపెట్టుకుంది నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆదాయం కోసమే తెరిచారు..
వాస్తవానికి ఇక్కడ ప్రమాదాలు కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. 2005లో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తాపడి 30 మంది మరణించారు. 2011లో ఇదే ఘాట్‌రోడ్డుపై లారీ బోల్తాపడి 16 మంది హనుమాన్‌ భక్తులు అసువులుబాసారు. దీంతో అప్పుడు కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్‌ ఈ ఘాట్‌రోడ్డు గుండా రాకపోకలను నిషేధించారు. ఈ ప్రాంతం జగిత్యాల జిల్లా కిందకు వచ్చింది. గతేడాదిగా ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగించాలని స్థానిక అధికారులు డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం దూరం తగ్గుతుంది.. టార్గెట్‌ పెరుగుతుంది.. వీలైనంత మంది ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకోవచ్చన్న అత్యుత్సాహమే ఇంతమంది ప్రాణాలు బలితీసుకుంది.

బస్సుల ప్రమాదాలు...
సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఉన్న ఆర్టీసీ బస్సులు కొంతకాలంగా తీవ్ర ప్రమాదాలకు హేతువులుగా నిలుస్తుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా జరిగిన కొండగట్టు ప్రమాదం ఏకంగా ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక మందిని బలితీసుకున్న విషాదకర దుర్ఘటనగా నిలిచిపోయింది.

గతంలో జరిగిన ఘటనలు..
- 2013 అక్టోబర్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది దుర్మరణం చెందారు.
- 2018 మే 26 సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 16 మంది చనిపోయారు.
- 2018 మే 29 కరీంనగర్‌ సమీపంలోని మానకొండూరు (చెంజర్ల) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు చనిపోయారు.
- 2018 సెప్టెంబర్‌ 10న గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు మరణం. 

కొండగట్టు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి ..
సాక్షి, న్యూఢిల్లీ: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈ మేరకు తెలుగులో ప్రకటన వెలువడింది. ‘కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటున్నదని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్‌ ద్వారా ఒక ప్రకటన చేశారు. ప్రమాదాన్ని మాటల్లో చెప్పలేని విషాదకర దుర్ఘటనగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

గవర్నర్‌ సంతాపం..
కొండగట్టు బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన కలచి వేసిందని పేర్కొన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో గవర్నర్‌ మాట్లాడారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సీఎం కేసీఆర్‌ తీవ్ర విచారం..
సాక్షి, హైదరాబాద్‌: కొండగట్టు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం ఆవేదన చెందారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం 
అందించనున్నట్లు ప్రకటించారు. 

అమ్మను చూపించరా..
గాయపడిన అమ్మ ఓ చోట.. చనిపోయిన కొడుకు మరో చోట. ‘నేను చని పోయినా ఫర్వాలేదు.. నా కొడుకును బతికించండి’ అంటూ ఓ తల్లి రోదన. ‘నాకు మా అమ్మను చూడా లని ఉంది. ఒక్కసారి చూపించండి అంకుల్‌’ అంటూ గాయాలతో డాక్టర్‌ను వేడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి. రోదనలు.. వేదనలు.. ఆప్తుల ఆర్త నాదాలు.. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో ఎటు చూసినా ఇదే పరిస్థితి. కాలు తెగిపోయిన ఓ వృద్ధురాలు.. చేయి విరిగిన ఓ యువతి, తలకు తీవ్రగాయాలై రక్తం, వాంతులతో మాట్లాడలేని స్థితిలో వృద్ధుడు, ఒకే కుటుంబంలో అందరూ చనిపోవడం, నిండు గర్భిణులు మృత్యువాత పడటం, ఆసుపత్రి మంచం మీద పడుకోబెట్టగానే చనిపోయిన మహిళలు.. అన్నీ కన్నీరు తెప్పించే దృశ్యాలే. మనసును మెలిపెట్టే సన్నివేశాలే. మృతులు, క్షతగాత్రుల బంధువులు వేల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని తమ వారి కోసం వెతుకు తుండటం కనిపించింది. తమతో పాటే బస్సెక్కిన వారు ఏమయ్యారో తెలియదు.. ఎవరు చని పోయారో.. ఎవరో బతికున్నారో చెప్పేవారు కూడా లేని దుస్థితి. కలసిన వారినల్లా ‘సార్‌.. మా అమ్మ ఎక్కడుంది, మా అయ్య ఎక్కడున్నడు’ అంటూ రోదిస్తూ అడగడం కనిపించింది. 

ఉద్యోగం వచ్చిందని అమ్మకు చెప్పేందుకు వచ్చి..
హిమ్మత్‌రావుపేట గ్రామా నికి చెందిన పడిగెల స్నేహ లత ఇటీవల బీటెక్‌ పూర్తి చేసింది. వెంటనే ఉద్యోగం సంపాదిం చింది. ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, తిరిగి బస్సులో వెళ్తూ మృతువాత పడింది. ఎప్పుడైనా వాళ్ల నాన్న దొంగలమర్రి వద్ద దించుతుండేవాడు. కాని తండ్రి వ్యవసాయ పను లకు పోవడంతో, ‘‘బస్సులో వెళ్తా. కొండగట్టు కింద దిగి హైదరాబాద్‌కు వెళ్తా’’ అని ఇంట్లో చెప్పిన కొద్ది నిమిషాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

డెలివరీ కోసం వస్తూ..
శనివారంపేటకు చెందిన ఎండ్రికాయల సుమలత నిండు గర్భిణి. డాక్టర్లు ఆమెకు బుధవారం డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో అత్త ఎండ్రికాయల వెంకవ్వ, కోనాపూర్‌కు చెందిన తల్లి ఎండ్రికాయల భూలక్ష్మితో కలిసి బస్సు ఎక్కింది. ప్రమాదంలో గర్భిణితోపాటు అత్త, తల్లి కూడా మృత్యువాత పడ్డారు.

పెళ్లయిన 9 నెలలకే..
శనివారంపేటకు చెందిన నామల మౌనికది చిన్న వయస్సే. పెళ్లి జరిగి 9 నెలలే అవుతోంది. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భిణి. డాక్టర్‌కు చూపించుకునేందుకు జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది.

బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని..
బంధువులు జగిత్యాల అసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో, వారిని చూసేందుకు బస్సులో వస్తూ డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గాజుల రాజవ్వ, గాజుల చిన్నయ్య మృత్యువాత పడ్డారు. దీంతో పరామర్శకని వచ్చి.. విగతజీవులుగా ఆస్పత్రికి చేరుకున్నారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

అమ్మను ఆసుపత్రిలో చూయించేందుకు వస్తూ..
తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన సామకూర మల్లవ్వ తన తల్లికి అనారోగ్యానికి గురైంది. జగిత్యాల ఆసుపత్రిలో చూయించేందుకు తల్లితో కలిసి బస్సులో వస్తూ మృత్యువాత పడింది. తల్లి మాత్రం కూతురు కోసం ఆసుపత్రిలో వేచి చూస్తోంది.

మధ్యాహ్న భోజన డబ్బు కోసం వెళ్తూ..
సండ్రళ్లపల్లికి చెందిన ఎల్లవ్వ.. గ్రామ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. మధ్యాహ్న భోజన డబ్బుల కోసం మల్యాల మండలంలోని బ్యాంకుకు వస్తూ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది.

బిడ్డకు జ్వరం వచ్చిందని..
డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన లైశెట్టి చంద్రకళ కూతురు హైదరాబాద్‌లో పీజీ చదువుతోంది. బిడ్డకు జ్వరం రావడంతో జగిత్యాల ఆసుపత్రిలో చూపిస్తానని చెప్పింది. దీంతో బిడ్డ నేరుగా జగిత్యాలకు రాగా, తల్లి చంద్రకళ బస్సులో జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో తల్లిపై పడి కూతురు రోదిస్తున్న తీరు కలచివేసింది.

కళ్లద్దాలు తీసుకుందామని..
శనివారంపేటకు చెందిన బొల్లారపు బాపుకు ఇటీవల కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. జగిత్యాల కంటి ఆసుపత్రిలో చూయించుకుని కళ్ల అద్దాలు తీసుకువెళ్దామని చెప్పి బస్సులో జగిత్యాల బయలు దేరి మృత్యువాత పడ్డాడు.

ఫ్యాన్‌ రిపేర్‌ కోసం వచ్చి.. 
రాంసాగర్‌కు చెందిన ద్యాగల ఆనందం.. ఫ్యాన్‌ చెడిపోవడంతో జగిత్యాలలో బాగు చేయిస్తామని చెప్పి, ఫ్యాన్‌ను తీసుకుని బస్సులో వెళ్తూ మృత్యువాత పడ్డారు.

నూనె పట్టించుకోవడానికి వచ్చి..
హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన గండి లక్ష్మి.. పల్లి నూనె పట్టించుకోవడానికి, పల్లీలు తీసుకుని జగిత్యాల బస్సు ఎక్కింది. ప్రమాదంలో మృతిచెందింది.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సోమారపు
ప్రమాదం జరగడం విషాదకరమని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ పేర్కొ న్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించిందని, ఆర్టీసీ తరఫున మరో రూ.3 లక్షలు ఇప్పిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే.. రూ.15 నుంచి 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పా రు. సిబ్బంది లేకపోవడం వల్లే డ్రైవ ర్లకు ఓవర్‌ డ్యూటీలు ఇస్తున్నామని, రద్దీని బట్టి అధిక డ్యూటీలు ఇస్తు న్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.

ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు..
బస్సు సామర్థ్యం పరంగా అన్ని పరీక్షలు పూర్తిచేసుకుంది. 3 నెలలకోసారి చేసే పరీక్షల్లో భాగంగా ఆగస్టు 9న ఈ బస్సుకు చివరిసారి అన్ని పరీక్షలు పూర్తి చేశారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. జగిత్యాల డిపో బాధ్యతలు చూస్తున్న డీఎం హనుమంతరావు కూడా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నాడు. మరి తప్పు ఎక్కడ జరిగింది? అన్న చర్చ ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతోంది. 52 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులో ఏకంగా 100 మందిని ఎక్కించుకునేలా కండక్టర్లకు టార్గెట్లు పెట్టిన అధికారులదే ఈ పాపం అని ఆర్టీసీ ఉద్యోగులు, స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు. పట్టుమని 10 మీటర్ల లోతులేని గోతిలో పడి ఏకంగా 57 మంది దుర్మరణం చెందడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రమాదం జరిగిన మూలమలుపు వద్ద ప్రయాణికులంతా డ్రైవర్‌ మీద పడేసరికి బస్సు అదుపుతప్పి గోతిలో పడింది.

ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ విచారం..
కొండగట్టు వద్ద బస్సు లోయలో పడిన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.  

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ 
కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
రూ.25 వేలు ప్రకటించిన ఎల్‌.రమణ 
బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని రమణ ప్రకటించారు. ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

కన్నవారి కలలు కల్లలు
కొడిమ్యాల: కొండగట్టు ప్రమాదంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతీ, యువకులు తనువు చాలించారు. మండలంలోని హిమ్మత్‌రావు పేటకు చెందిన మల్యాల అనిల్‌ (19) జగిత్యాల లోని ఎన్‌ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు బయల్దేరిన అనిల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందాడు.  ఇదే గ్రామానికి చెందిన పడిగెల స్నేహలత (19) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. కింది కొండగట్టు వరకు వెళ్లి, అక్కడినుండి కరీంనగర్‌ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో తుదిశ్వాస విడిచి, కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. 

రాంపల్లిలో విషాదం
పెద్దపల్లిరూరల్‌: కొండగట్టు వద్ద మంగళ వారం ఆర్టీసీ బస్సు లోయలో పడ్డ ఘటన పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాంపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుం బాలకు చెందిన 8మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు వారిలో నలుగురు మృత్యు వాత పడ్డారు. రాంపల్లికి చెందిన బొంగాని నారాయణ, ఆయన భార్య స్వప్న, కుమారులు రాంచరణ్, పర్శరాములు, తల్లి భూమక్క, చేగుర్తి నుంచి వచ్చిన అత్త బాలసాని రాజేశ్వరీలతో పాటు సమీప బంధువులైన బొంగాని మధునయ్య, మధునమ్మ దంపతులు శనివారం సాయం త్రం దైవదర్శనానికి బయల్దేరారు. కొమురవెల్లి, వేముల వాడ, కొండగట్టు దేవాలయాల్లో మొక్కులు సమర్పించు కుని మంగళవారం తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో దిగుతామనుకునే లోపే తాము ఎక్కిన బస్సు ప్రమాదానికి గురై బొంగాని మధునయ్య (54), బొంగాని భూమక్క (50), బాలసాని రాజేశ్వరి (48), రాంచరణ్‌ (12)లు అక్కడికక్కడే మరణించారు. బొంగాని నారాయణ, స్వప్న, పర్శరామలు, మధునమ్మలు తీవ్ర గాయాలతో కరీంనగర్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వచ్చెవారం పోయిన బాగుండు..
‘అమవాస్య అయితంది.. మల్లొచ్చే వారం పోతమన్నరు.. ఏమైందో ఏమో శని వారమే బయల్దేరి పోయిండ్రు. వచ్చే వారం పోయినా బతుకుదురు. దేవుని మొక్కులు అప్పజెప్పెతందుకు పోయి దేవుని దగ్గరనే ఉండిపోయిండ్రు’
– బొంగాని చిలకమ్మ, రాంపల్లి

సహాయక చర్యల్లో పాల్గొనండి: రాహుల్‌ 
కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృత్యువాతపడటం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు సహాయక చర్యలు అందించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. కాగా, మృతుల కుటుంబాలకు  రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top