పండుగ చేసుకున్నారు!

Huge income to the liquor traders and railways and RTC for Sankranthi festival - Sakshi

వివిధ సంస్థలకు ఆదాయమే ఆదాయం 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం వ్యాపారులు, రైల్వేశాఖ, ఆర్టీసీ, మెట్రోసంస్థలు పండుగ చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటికి కాసులపంట పండింది. రూ.వందకోట్ల మేర మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించినవారితో రైల్వేశాఖకు రూ.50 కోట్లు, ఆర్టీసీకి రూ.15 కోట్లు, మెట్రోకు రూ.5 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఆయా విభాగాల అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అటు మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. నగరం ఒక చివరి నుంచి మరో చివరికి.. అంటే అత్యధిక రద్దీ ఉండే ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ.) మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి రావడంతో మెజార్టీ సిటిజన్లు మెట్రోసేవలను వినియోగించుకున్నారు. ఐదురోజులుగా మెట్రోకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో నుమాయిష్‌ను తిలకించేందుకు మెజార్టీ సిటిజన్లు మెట్రోరైళ్లలో ప్రయాణం చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు.  

ఆర్టీసీకి రూ.15 కోట్లు.. 
సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, నగరాలకు సుమారు పదివేల రెగ్యులర్, ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో 4 రోజులుగా సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ సందర్భంగా రూ.50 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు కిటకిటలాడాయి. వరుస సెలవులు రావడంతో 4 రోజుల్లో వందకోట్ల విలువైన మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top