దప్పిక తీరే దారేది..!

how to solve thirsty problems - Sakshi

మూగజీవాల అరణ్య రోదన

ముదురుతున్న ఎండలు

నిరుపయోగంగా నీటితొట్టిలు

నాణ్యతాలోపంతో నిధులు మట్టిపాలు

బజార్‌హత్నూర్‌(బోథ్‌): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు.
 
576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి.

వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు.  దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి.

వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్‌ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

మూగజీవాలపై నిర్లక్ష్యం..  
వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్‌ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. 

ఉపయోగంలోకి తేవాలి
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది.  
– సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్‌ వేదిక జిల్లా అధ్యక్షుడు

దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం
జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. 
– రాజేశ్వర్‌ రాథోడ్, 
డీఆర్‌డీఏ పీడీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top