కల నిజమాయె! | House And Plots Demands in Hyderabad | Sakshi
Sakshi News home page

కల నిజమాయె!

Apr 27 2019 8:39 AM | Updated on May 1 2019 11:32 AM

House And Plots Demands in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లు, ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో నిర్మాణ రంగం జెట్‌ స్పీడుతో దూసుకెళుతోంది. ఫ్లాట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడంతో కొత్తగా ప్రారంభమవుతున్న నిర్మాణాలకు గిరాకీ పెరుగుతోందని అనరాక్‌ ప్రాపర్టీస్‌ సంస్థ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లపై కొనుగోలుదార్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో ఇళ్లకు డిమాండ్‌ 5 నుంచి 18 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారిలో 58 శాతం మంది తాము నివాసం ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. మరో 42 శాతం మంది సమీప భవిష్యత్‌లో మంచి ధర పలకుతుందని, తమ పెట్టుబడికి  మంచి లాభదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో కొనుగోలు చేస్తుండడం విశేషం.

జీఎస్టీ తగ్గింపే అసలు కారణం
స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమల్లోకి రావడం, జీఎస్‌టీ రేట్లు తగ్గడంతో కొత్త నిర్మాణాలపై కొనుగోలుదార్లకు నమ్మకం పెరుగుతోందని ఈ సర్వేలో ప్రకటించారు. నగరంలో ప్రధానంగా అధిక శాతం మధ్యతరగతి వేతనజీవులు రూ.80 లక్షల లోపు స్థిరాస్తులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటు ధరల గృహాలపై జీఎస్‌టీ రేటు 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఈ విభాగంలోకి రాని నిర్మాణాలపై 12 శాతం ఉన్న జీఎస్‌టీ 5 శాతానికి చేరడంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజా పరిణామం ఫ్లాట్ల కొనుగోలుదారులకు భారం తగ్గించిందని, గిరాకీ పెరగడానికి దోహదం చేసిందని అనరాక్‌ సంస్థ తెలిపింది. పన్ను పరంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో పాటు, మార్కెట్‌ పరిస్థితులు కూడా కలిసి వస్తుండటంతో నగరంలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుందని తెలిపింది.

శివార్లలో రియల్‌ భూమ్‌
గ్రేటర్‌ శివార్లలో రియల్‌ భూములకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా నిర్మాణ రంగానికి శివార్లు కొంగుబంగారంగా మారాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు అధికంగా కొనుగోలుచేసే గృహ సముదాయాలకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు పలు నిర్మాణ రంగ సంస్థలు శ్రీకారం చుట్టి వేంగా ప్రజెక్టులను పూర్తి చేస్తుండడం విశేషం.  

ఈ ప్రాంతాలు అదరహో..  
నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, షేక్‌పేట్, నార్సింగి, పుప్పాలగూడ, బాచుపల్లి, కొంపల్లి, బొల్లారం, ఎల్బీనగర్, హయత్‌నగర్, యాంజాల్‌ తదితర ప్రాంతాల్లో నూతన నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూ.40–80 లక్షల సెగ్మెంట్‌లో నివాస గృహాలతో పాటు సువిశాలమైన, విలాసవంతమైన  ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నట్లు రియల్టీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక విలాసవంతమైన(లగ్జరీ) ఇళ్ల విభాగంలో తెల్లాపూర్, కొల్లూరు, గోపన్‌పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో బుకింగ్స్‌ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.  

గతంతో పోలిస్తే అత్యధికం
నగర శివార్లలో 2017లో సుమారు ఆరు వేల నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇక 2018లో ఏడువేల నూతన ప్రాజెక్టులు సాకారంకాగా.. ఈ ఏడాదిలో సుమారు 15 వేల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాంటే గ్రేటర్‌లో ఇళ్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.  

పొరుగు రాష్ట్రాల వారు సైతం..
ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలకు గ్రేటర్‌ కేంద్రంగా మారింది. దీంతో విద్య, ఉద్యోగం, ఉపాధి, వాణిజ్యాల కోసం పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భారీగా వలస వస్తున్నారు. వీరంతా నగర శివార్లలో వారి స్తోమతను బట్టి అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది పలు నిర్మాణ సంస్థలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించాయి. వీటిలో అపర్ణ, రాజపుష్ప, వాసవి, బ్రిగేడ్, సుమధుర వంటి సంస్థలు నూతన ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి పూర్తి కానున్నట్లు ‘రియల్‌’ రంగ నిపుణులు చెబుతున్నారు.  

ఇళ్ల ధరలు ఇలా..
అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులు ప్రధానంగా రూ.40లక్షల నుంచి రూ.80 లక్షల విలువచేసే అపార్ట్‌మెంట్లు, స్వతంత్ర గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎగువ మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.4000–6500 మధ్య ఉన్నాయి. సంపన్న శ్రేణి కొనుగోలుచేసే సువిశాలమైన లగ్జరీ విల్లాలు, ప్లాట్లు చదరపు అడుగుకు సుమారు రూ.7500– రూ.13000 వరకు ధర పలుకుతుండడం విశేషం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement