కాలేజీ విద్యార్థుల సుదూర ప్రయాణానికి చెక్‌పెడుతూ కళాశాల సమీపంలో వసతి కల్పించి సేవలందించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కళాశాల విద్యార్థి వసతిగృహాలు కొందరు అధికారులకు వరంగా మారాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాలేజీ విద్యార్థుల సుదూర ప్రయాణానికి చెక్‌పెడుతూ కళాశాల సమీపంలో వసతి కల్పించి సేవలందించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కళాశాల విద్యార్థి వసతిగృహాలు కొందరు అధికారులకు వరంగా మారాయి. ఈ వసతి గృహాలు మంజూరైన వాస్తవ ప్రాంతంతో సంబంధం లేకుండా వారి ఇష్టానుసారంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అవి కాస్తా ఆయా సంక్షేమ వసతిగృహ అధికారులకు సౌకర్యవంతంగా అవతరించగా, విద్యార్థుల పాలిట శాపంగా మారాయి.
వెనుకబడిన తరగతుల బాలబాలికలకు వేర్వేరుగా శాసనసభ నియోజకవర్గానికి ఒక వసతిగృహం చొప్పున ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా దాదాపు నాలుగేళ్ల కితం జిల్లాకు 29 వసతిగృహాలు మంజూరయ్యాయి. ఇందులో బాలికలకు 15, బాలురకు 14 వసతిగృహాలు వచ్చాయి. దీంతో ఈ హాస్టళ్ల ఏర్పాటుకు ఉపక్రమించిన బీసీ సంక్షేమశాఖ.. ప్రస్తుతం 28 హాస్టళ్లను ప్రారంభించి కొనసాగిస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన బాలుర వసతిగృహం మాత్రం భవనం లభించకపోవడంతో ఇంకా ప్రారంభం కాలేదు.
పరిధితో పొంతన లేదు...
బీసీ బాలబాలికల కోసం కేటాయించిన వసతిగృహాలు నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో 14 మంజూరయ్యాయి. వీటిని నియోజకవర్గ పరిధిలో ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందనే భావనతో సర్కారు హాస్టళ్ల ఏర్పాటును అమల్లోకి తెచ్చింది. కానీ జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఈ నిబంధనలకు తుంగలో తొక్కింది. నియోజకవర్గ పరిధిలో కాకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వసతి గృహాన్ని ఏకంగా 25 కిలోమీటర్ల దూరంలో సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసింది.
రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేయాల్సిన హాస్టల్‌ను దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేశారు. ఫలితంగా కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో హాస్టళ్లు అందుబాటులో లేవు. దీంతో ఒక చోట ఏర్పాటు చేయాల్సిన హాస్టల్ మరో చోట ఏర్పాటు చేయడంతో ఆ నియోజకవర్గ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వసతి ప్రశ్నార్థకంగా మారింది. ఇలా జిల్లాలోని పలు నియోజకవర్గాలకు కేటాయించిన హాస్టళ్లు కూడా సంబంధం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం గమనార్హం.
అంతా గజిబిజిగా..
బీసీ కాలేజీ విద్యార్థుల హాస్టళ్ల ఏర్పాటులో విషయంలో గందరగోళం కనిపిస్తోంది.. వాస్తవానికి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన హాస్టళ్లు.. పొరుగు ప్రాంతాల్లో కొనసాగిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల పెద్ద సంఖ్యలో డిగ్రీ, వృత్తివిద్య కళాశాలలున్నాయి. నియోజకవర్గానికి మంజూరైన హాస్టల్ అదేప్రాంతంలో ఏర్పాటు చేస్తే స్థానికంగా విద్యార్థులకు ఉపయోగపడేవి. కానీ అలా కాకుండా అత్యధికంగా సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాల్లోనే ఆరు హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ అంశంపై ఆ శాఖలోని ఓ అధికారి ఉన్నతాధికారికి లేఖ రాసి నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
విద్యార్థుల సౌకర్యం కోసమే..
విద్యార్థులకు కాలేజీతో పాటు వృత్తిపరమైన కోర్సులు నేర్చుకునే ఇన్‌స్టిట్యూట్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ హాస్టళ్లను ఏర్పాటు చేశాం. దీంతో ఈ హాస్టళ్లలో ఉండేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ హాస్టళ్లలోనే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. -వి.రమణారెడ్డి, బీసీ సంక్షేమశాఖ ఉపసంచాలకులు