హోంగార్డులకు ఊరట! | Home Guards relief to break decreasing of home guards by government decision | Sakshi
Sakshi News home page

హోంగార్డులకు ఊరట!

May 23 2014 4:30 AM | Updated on Sep 27 2018 5:59 PM

హోంగార్డులకు ఊరట! - Sakshi

హోంగార్డులకు ఊరట!

రాష్ట్ర విభజన నేపథ్యంలో హోంగార్డులకు కాస్త ఊరట లభించింది. వీరి సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

* సిబ్బంది తగ్గింపు ప్రక్రియకు బ్రేక్
* విభజన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హోంగార్డులకు కాస్త ఊరట లభించింది. వీరి సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనిపై కొత్తగా ఏర్పడే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని వివిధ శాఖల్లో ప్రస్తుతం దాదాపు 27 వేల మంది హోంగార్డులుగా పని చేస్తున్నారు. మరికొందరు డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉన్నారు. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న ఈ చిరుద్యోగులు సుదీర్ఘకాలం పొరాడి వేతన పెంపును సాధించుకున్నారు.  ఈ మేరకు జనవరిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ సందర్భంగా సర్కారు పెట్టిన మెలిక హోంగార్డులను కలవరపెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీరి సంఖ్యను 20 వేలకు కుదించాలని అందులో నిర్దేశించింది.
 
  దీనిపై అప్పట్లోనే విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు.. సంఖ్యను కుదించడం ఆచరణ సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనం విషయంలో కానిస్టేబుళ్ల కంటే చాలా తక్కువ తీసుకుంటున్నా.. వారితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులను తగ్గిస్తే సమస్యలు రావచ్చని, తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుందని గట్టిగా వాదించారు. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాలని, సానుకూల స్పందన రాకుంటే అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు విభజన ప్రక్రియ పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వాయిదా పడినట్లేనని డీజీపీ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
 రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల హోంశాఖలే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోపక్క ఉద్యోగుల విభజనకు సంబంధించి జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల విషయంలో ఎలాంటి సమస్య లేదు. డీజీపీ, సీఐడీ వంటి ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఇతర ప్రాంతాల వారిని మాత్రం బదిలీ చేయాల్సి ఉంటుందని తొలుత భావించారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం కింది స్థాయి ఉద్యోగుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా విభాగాల అధిపతులకు ఉంటుంది. దీంతో సిబ్బంది విభజనతో ఏర్పడే కొరతను దృష్టిలో పెట్టుకుని హోంగార్డులను యథాస్థానాల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోంగార్డుల తొలగింపు ప్రక్రియ ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement