కొత్త రూట్లో మెట్రో కూత | Sakshi
Sakshi News home page

కొత్త రూట్లో మెట్రో కూత

Published Wed, Feb 5 2020 4:53 AM

HMR Is The Biggest Metro After Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు మరో కొత్త రూట్లో పరుగులు తీయడానికి సిద్ధమైంది. జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ రూట్లో ఇది ప్రయాణికులకు అందుబా టులోకి రానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ జెండా ఊపి ఈ మూడవ మెట్రో రైలు కారిడార్‌ను ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ –సికింద్రాబాద్‌ జంటనగరాలను అనుసంధానించే ఈ మార్గాన్ని.. మెట్రో అధికారులు వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. తొలుత సంక్రాం తి నాటికి ప్రారంభించేందుకు ప్రయత్నించినా, మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ కారణంగా ఆలస్యమైంది.

ఈ మార్గం అందుబాటులోకి రానుండటంతో నగరంలో తొలి దశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణమైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్‌–మియాపూర్‌ రూటులో 29 కి.మీ., నాగోలు– రాయదుర్గం రూటులో 29 కి.మీ. మేర మెట్రో మార్గం అందుబాటులో ఉంది. ఈ రూట్లలో నిత్యం 3.8 లక్షల నుంచి 4 లక్షల మంది రాకపోకలు సాగి స్తున్నారు. 7న ప్రారంభమయ్యే నూతన మార్గం తో కలిపి 3 కారిడార్ల పరిధిలో 69 కి.మీ. మేర నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుం ది. ఢిల్లీ తర్వాత అత్యంత నిడివి గల మెట్రో మార్గమున్న నగరంగా హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన మొదటి, అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే కావడం విశేషం.

పాతనగరానికి మరింత ఆలస్యం..
జేబీఎస్‌–ఎంజీబీఎస్‌.. ఈ రెండు బస్సుస్టేషన్లకు పొరుగు రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించేందుకు ఈ మెట్రో మార్గం వీలు కల్పిస్తుంది. కొత్త మార్గం లో 45 రోజుల పాటు మెట్రో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలు విజయవంతంగా నిర్వహిం చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్‌ ఆఫ్‌ రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ సైతం లభించింది. కాగా, ఈ మార్గాన్ని పాతనగరంలోని ఫలక్‌నుమా వరకు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. సుల్తాన్‌బజార్‌లో ఆస్తుల సేకరణ, అలైన్మెం ట్‌ చిక్కులతో ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆస్తులు కోల్పోయిన బాధితులకు మెరుగైన పరిహారం అందించడంతో పాటు వాణిజ్య కాంప్లెక్స్‌లో వారి వ్యాపార సముదాయాలకు చోటుకల్పించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైం ది. ఈ కారిడార్‌ను పాతనగరం వరకు విస్తరించే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

►3వ కారిడార్‌ స్వరూపం
►11 కి.మీ. జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గం నిడివి
►9 ఈ రూట్లో గల స్టేషన్లు
►18 ని‘‘ప్రయాణ సమయం
►1,00,000 రోజువారీ ప్రయాణికుల సంఖ్య (అంచనా)

Advertisement
Advertisement