ఫోర్డ్‌తో హెచ్‌ఎండీఏ ఒప్పందం

HMDA agreement with Ford - Sakshi

ప్రయాణికులకు అనువైన విధానాలపై అధ్యయనం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ప్రయాణికులకు అనువుగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ఫోర్డ్‌ కంపెనీతో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఎంవోయూ కుదుర్చుకుంది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మున్సిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, ఫోర్డ్‌ కంపెనీ డైరెక్టర్‌ ఆర్‌.మహదేవన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రవాణా సదుపాయాలను ఎంచుకోవటం, అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగనుంది. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ, మౌలిక వసతులు, రవాణా సదుపాయాల దృష్ట్యా హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉందని, సిటీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం మరింత మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటం సవాలుగా మారుతోందని, ఫోర్డ్‌ కంపెనీ ఈ దిశగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ కంపెనీ డైరెక్టర్‌ ఆర్‌.మహదేవన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మెట్రో రైలు, దాదాపు ఎనిమిది వందల బస్సులు ప్రతిరోజు సిటీలో ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రయాణాన్ని మరింత సుగమం చేసే దిశగా రవాణా సదుపాయాలన్నింటా డిజిటల్‌ క్యాష్‌లెస్‌ వన్‌ టైమ్‌ పేమెంట్స్, మొబైల్‌ టికెటింగ్, స్మార్ట్‌ కార్డ్‌ పేమెంట్స్‌ జరిగే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రవాణాను అందుబాటులో ఉంచేందుకు ఫోర్డ్‌ కంపెనీ అధ్యయనం చేయనుంది. ఫోర్డ్‌ కంపెనీ ఇప్పటికే ఇండోర్, ముంబై సిటీల్లో రవాణా సేవలను అందిస్తోంది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top