గోడపై గుడి చరిత్ర!

History of the temple on the wall - Sakshi

గోడలపై వాటి నేపథ్యం, ప్రధానఘట్టాలతో కూడిన చిత్రాలు, వర్ణన 

ప్రయోగాత్మకంగా కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో సిద్ధం  

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం ఎవరు నిర్మించారు.. ఎప్పుడు నిర్మించారు.. ఆలయానికి వెళ్లే భక్తుల్లో చాలామందికి తెలియని విషయాలివి. కానీ, ఇప్పుడు ఆలయానికి వెళ్తే దాన్ని చారిత్రక కారణాలు, ఆలయ నిర్మాణం తర్వాత జరిగిన ఘటనలు కళ్లకు కట్టేలా గోడలపై చిత్రాలతో కూడిన వర్ణన కనిపిస్తుంది. ఈ దేవాలయం వెనక ఇంతటి నేపథ్యం ఉందా అని భక్తులు అబ్బురపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాల గురించి పుస్తకాల్లో తప్ప గుడిలో చెప్పేవారుండరు. అందుకే దేవాదాయశాఖ ఆలయాల చరిత్ర భక్తులకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఇక ఆలయాల చరిత్రకు ఆ గుడిగోడలు ఆలవా లం కానున్నాయి. అన్ని పురాతన దేవాలయాల నిర్మాణ నేపథ్యం వంటి  వివరాలు  దేవాలయాల గోడలపై రాయించాలని, చిత్రాలు వేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవా దాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌  ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో దాని చరిత్రను గోడలపై ఏర్పాటు చేయించారు.  

దేవాలయాల ప్రాధాన్యం పెంచేందుకే..... 
పట్టణాలు, పల్లెల్లో ఇప్పుడు విరివిగా ఆలయాలు నిర్మితమవుతున్నాయి. చెత్తకుప్పల పక్కన, చిన్న, చిన్న ఇరుకు గదుల్లో, అపార్ట్‌మెంట్‌ తరహా నిర్మాణాలోనూ గుడులు వెలుస్తున్నాయి. కొన్ని గుడుల్లో, కొన్ని సందర్భాల్లో సినిమా పాటలు, రికార్డింగ్‌ డాన్సులు లాంటి వాటితో హోరెత్తిస్తున్నారు. దీంతో భక్తిభావం సన్నగిల్లేలా అవకాశముందనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. వీటివల్ల పురాతన దేవాలయాల ప్రాభవం తగ్గుతోంది. దీన్ని గమనంలో ఉంచుకుని దేవాదాయశాఖ భక్తుల్లో ఆలయాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిం చి వాటి వైభవం పెరిగేలా చేయాలని నిర్ణయించింది.  

పెయింటింగ్స్‌కు కంటే మెరుగైన పద్ధతిలో... 
స్థానికులకు, ఆలయాలపై కొంత అవగాహన ఉన్నవారికే వాటి చరిత్ర తెలుస్తోంది. కొత్త భక్తులకు వాటి నేపథ్యంపై అవగాహన ఉండటం లేదు. ఇప్పుడు భక్తులందరికీ గుడుల చారిత్రక నేపథ్యంపై అవగాహన తెచ్చేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గోడలపై పెయింటింగ్‌ వేయిస్తే అది ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. పండుగలప్పుడు రంగులేస్తే ఈ పెయింటింగ్స్‌ మలిగిపోయే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేసే అవకాశం ఉండే పద్ధతులను అనుసరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top