సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఒకే విధంగా సెమిస్టర్, క్రెడిట్లు, గ్రేడింగ్ విధానం, సిలబస్ ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది.
కోర్సుల వారీగా ఒకే రకమైన సెమిస్టర్, క్రెడిట్లు, గ్రేడింగ్ ఖరారు చేసేందుకు ఒక కమిటీని, అన్ని కోర్సుల్లో ఒకే రకమైన సిలబస్ కోసం మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలను ఒకటి లేదా రెండ్రోజుల్లో ఏర్పాటు చేయనుంది.