రాజీనామా.. రచ్చరచ్చ

High Drama over Revanth Reddy Resignation Letter - Sakshi

రేవంత్‌ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి 

 స్పీకర్‌కు లేఖ చేరలేదన్న ప్రకటనలతో విమర్శల దాడి 

 కాంగ్రెస్‌ నేతను ఉప పోరులోకి దించేందుకు ‘గులాబీ’ సేన యత్నాలు 

 దమ్ముంటే లేఖ నేరుగా ఇవ్వాలంటూ సవాల్‌ 

అధికార ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తున్న ‘ఎనుముల’ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కొడంగల్‌ రాజకీయాలు మరింత రక్తి కడుతున్నాయి. టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో మొదలైన రాజకీయ వేడి రోజురోజుకు రగులుతోంది. ఇందులో ప్రధానంగా రేవంత్‌ తన ఎమ్మెల్యే పదవికి చేసినట్లుగా చెబుతున్న రాజీనామా అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ ఇచ్చానని చెబుతుండగా.. అది ఇప్పటి వరకు స్పీకర్‌కు చేరకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ.. రేవంత్‌ ఇప్పటి వరకు రాజీనామా చేయలేదంటూ బాంబు పేల్చారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా విషయమై రేవంత్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. దమ్ముంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు నేరుగా అందజేయాలంటూ ప్రతీ వేదికపై సూచిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలను రేవంత్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేవంత్‌ కుటుంబీకుల సంబంధించి శుభకార్యాలు ఉన్నందున.. అవి పూర్తికాగానే జనం మధ్యకు వచ్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.  

స్పెషల్‌ ఫోకస్‌ 
కొరకరాని కొయ్యలా మారిన రేవంత్‌ను కట్టడి చేయడం కోసం టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిచింది. ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి నిరంతరం నియోజకవర్గ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలను వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే, అధికార పార్టీ ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా రేవంత్‌ తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం కోస్గిలో నిర్వహించిన సభలో దమ్ముంటే తనపై పోటీకి రావాలంటూ నేరుగా సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసరడమే కాకుండా కేటీఆర్, హరీశ్‌రావుపై కూడా మాటల తూటాలు పేల్చారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ మరో వ్యూహానికి పదును పెడుతోంది. రేవంత్‌ను ఎలాగైనా ఉపపోరులో దించాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రతీ మండలంలోని పార్టీ నేతలతో సమావేశాలు పెట్టిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయిస్తోంది.   

కదం తొక్కుతున్న రేవంత్‌ 
అధికార పార్టీ చేసే చర్యలకు అనుగుణంగా రేవంత్‌ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జనం మధ్య సెంటిమెంట్‌ రగిల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. తాను ఎక్కడ మాట్లాడినా పదే పదే కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ‘ఒకప్పుడు ఎవరికీ తెలియని కొడంగల్‌ పేరును ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశమంతా గుర్తుపడుతోంది. నేనెప్పుడు ఇక్కడి ప్రజలకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించా.. శ్వాస ఉన్నంత వరకు ఇక్కడి నుంచే పోటీ చేస్తా. వైఎస్‌ ఫ్యామిలీకి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం మాదిరిగా ఎప్పడికి నాకు ఇదే నియోజకవర్గం శాశ్వతం’ అంటూ సెంటిమెంట్‌ను రగులుస్తున్నారు. అయితే, తన వెంట ఇన్నాళ్లు నిలిచిన వారందరినీ టీఆర్‌ఎస్‌ లాగేసుకుపోయిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో బీటలు వారిన పార్టీకి జవసత్వాలను నింపేందుకు కార్యాచరణ చేపట్టారు. ప్రతీ గ్రామంలో స్వయంగా తానే పర్యటించాలని నిర్ణయించారు. స్థానిక కార్యకర్తలతో మాటమంతి జరపడంతో పాటు పార్టీ మారిన వారిని సైతం తిరిగి చేర్చుకోవాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఉపపోరులో దిగి తన సత్తా నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో కొడంగల్‌ రాజకీయాలు రక్తి కడుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top