ఆ వివరాలు బయటపెట్టాలని ఆదేశించలేం

High Court Verdict On Duplicate Voter List - Sakshi

డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు సమాచారంపై హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: డూప్లికేట్‌ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పంచుకున్న సమాచార వివరాలను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఒక పక్క సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకోవడం గోప్యత హక్కుకు భంగమని చెబుతున్న పిటిషనర్‌... మరోపక్క దాన్ని బహిర్గతం చేయాలని కోరడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఓటరు కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొంది. ఆన్‌లైన్‌ అన్నది ఓ మాయాబజార్‌ వంటిదని, అందులో ఓసారి సమాచారాన్ని బహిర్గతం చేస్తే దాన్ని నిమిషాల్లో లక్షల్లో కాపీ చేసుకుంటారని, దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తెలిపింది.

ఒకవేళ ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకున్న ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం ఆ సమాచారాన్ని పునఃసృష్టించుకునే పరిజ్ఞానం ఇప్పుడు అంతటా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్‌ కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించే అంశంపై మాత్రం లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీ సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పుచేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన ఇంజనీర్‌ కొడలి శ్రీనివాస్‌ హైకోర్టులో గతేడాది పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top