పరిపూర్ణానంద బహిష్కరణపై హైకోర్టు స్టే

High Court stay on the expulsion of Paripoornananda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో నగర బహిష్కరణ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ స్వామీజీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్వామీజీ నిరసిస్తూ చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు స్వామీజీని జూబ్లీహిల్స్‌లో బస చేసిన నివాసంలోనే నిర్బంధంలో ఉంచారు.

మెజార్టీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటూ కత్తి మహేశ్‌ను అప్పటికే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. అనంతరం స్వామీజీని కూడా నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణం చూపించి ఈ బహిష్కరణ చేశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర చర్యల నివారణ చట్టం కింద స్వామీజీని నగర బహిష్కరణ చేయడం అన్యాయమని, ఇతర జిల్లాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమని స్వామీజీ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. స్వామీజీ నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top