‘పొగాకు’ నిషేధంపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు 

High Court notices to the state and central govt about Tobacco products - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పొగాకుతో తయారు చేసే గుట్కా, పాన్‌ మసాలాలు తదితర ఉత్పత్తుల నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు  అభిప్రాయపడింది.  గుట్కా, పాన్‌ మసాలాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పాన్‌మసాలా ఉత్పత్తుల తయారీ, భద్రపర్చడం, పంపిణీ, రవాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనిక్‌ టుబాకో ప్రొడక్ట్స్‌ సంస్థ అధిపతి సయ్యద్‌ ఇర్ఫానుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆహార భద్రత కమిషనర్‌ ఈ ఉత్తర్వులను జారీచేశారని, అసలు పొగాకు ఆహారం కాదని పిటిషనర్‌ కోర్టుకు నివేదించారు. బండ్లగూడలోని తమ పరిశ్రమలోకి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే తనిఖీలకు వస్తున్నారన్నారు.

రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్, గుంటూరులోని టుబాకో చైర్మన్, ఆహార భద్రత శాఖ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top