రేవంత్‌ ఈపీ విచారణకు ఓకే | High Court notices to many including Patnam Narender Reddy In Revanth EP | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఈపీ విచారణకు ఓకే

Mar 10 2019 3:11 AM | Updated on Mar 10 2019 12:19 PM

High Court notices to many including Patnam Narender Reddy In Revanth EP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్‌ నియోజకవర్గం నుంచి పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌(ఈపీ)ను హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులైన పట్నం నరేందర్‌రెడ్డి, ఎన్నికల బరిలో నిలిచిన 8 మంది అభ్యర్థులకు, రిటర్నింగ్‌ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో భద్రపరిచిన ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. ఈవీఎంల ఉపయోగానికి అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల అతని ఎన్నిక రద్దు చేసి కొడంగల్‌ నుంచి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.50 లక్షలను పట్నం నరేందర్‌రెడ్డి మనుషుల నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ మొత్తం రూ.5 కోట్ల వరకు ఉంటుందని, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్న విషయాలను నరేందర్‌రెడ్డి బావమరిది తన పుస్తకంలో స్పష్టంగా రాసుకున్నారని, దీనిని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నరేందర్‌రెడ్డి తన అక్రమాలకు ఫామ్‌హౌజ్‌ను వేదికగా చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో రూ.14 కోట్ల వరకు ఖర్చుపెట్టిన నరేందర్‌రెడ్డి, ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం కేవలం రూ.26 లక్షలే ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారన్నారు. నరేందర్‌రెడ్డి అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఎన్నికల పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. 
ఈవీఎంలు వాడుకోండి... 
ఎన్నికల పిటిషన్‌ నేపథ్యంలో కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచామని, పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కూడా జస్టిస్‌ షావిలి విచారణ జరిపారు. ఎన్నికల సంఘం తరఫు, రేవంత్‌ తరఫు న్యాయవాదుల వాదనలు     విన్న న్యాయమూర్తి.. ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు ఈసీకి అనుమతిస్తూ          ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement