కోమాలో ఉన్నట్టుంది

High Court Fires On GHMC - Sakshi

జీహెచ్‌ఎంసీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

కాలుష్య పరిశ్రమలపై చర్యలకు హైకోర్టు అనుమతి అవసరం లేదు

8 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించారంటూ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ ప్రాంతంలోని శాస్త్రిపురంలో కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకుని కూర్చుంటారా అని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. 2012లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 198 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని చెబుతున్నారని, అవి ఇప్పుడు 345కు చేరాయని, 8 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని, జీహెచ్‌ఎంసీ కోమాలో ఉన్నట్లుగా అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసులిచ్చిన పరిశ్రమలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

శాస్త్రిపురంలో ప్లాస్టిక్‌ పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడు తోందంటూ వినయ్‌ పాల్నిట్‌కర్, రషీద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్, డిప్యూటీ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ, పీసీబీ, విద్యుత్‌ శాఖలు అలాంటి పరిశ్రమల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ‘కాలుష్యంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తే ఢిల్లీని దాటేస్తాం. శాస్త్రిపురంలో 268 ఎకరాల్లో పరిశ్రమలు ఉంటే వాటిజోలికే వెళ్లకుండా అఫిడవిట్లు దాఖలు చేశారు.

తొలిసారి 3 కాలుష్య పరిశ్రమలే ఉన్నాయన్నారు. మేము క్షేత్ర స్థాయిలోకి మా ప్రతినిధి ని పంపి నివేదిక తెప్పించుకున్నాక 198 ఉన్నా యని చెప్పారు. 2012 నాటి పిల్స్‌లో ఇంతవరకూ ఏం చేశారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. జరిగిన పొరపాటుకు లోకేష్‌కుమార్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, నిజాయి తీగా తప్పును ఒప్పుకున్నందుకు అభినందిస్తున్నట్లు పేర్కొంది. 98 పరిశ్రమల్ని మూసేశామని, 198కి నోటీసులిచ్చామని కమిషనర్‌ చెప్పారు. పీసీబీతో కలిసి ఎందుకు పనిచేయడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏ పరిశ్రమ భవనానికైనా జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వాలని, అలాంటప్పుడు కాలుష్య పరిశ్రమలు ఎలా వచ్చాయని నిలదీసింది.

హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక ప్రకారం శాస్త్రిపురంలో 345 కాలుష్య పరిశ్రమల్ని తొలగించాలని చెప్పిందని, పీసీబీ మాత్రం 34 పరిశ్రమలనే అంటోందని తప్పుపట్టింది. 345 పరిశ్రమలకు ఈ నెల 2న నోటీసులు ఇస్తే వచ్చిన సమాధానాల్ని పరిశీలిస్తే 281 పరిశ్రమల్ని మూసేయాలని నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాంటి పరిశ్రమల్ని మూసేందుకు చట్టప్రకారం వ్యవహరించాలని, అందుకు ప్రత్యేకంగా హైకోర్టు అనుమతులు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2012లో పిల్స్‌ దాఖలైతే పీసీబీ ఎనిమిదేళ్లుగా ఏం చేస్తోందని ప్రశ్నించింది.

మూడేళ్ల క్రితం నోటీసు లిచ్చారంటే ఆ తర్వాత తీసుకున్న చర్యల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ, పీసీబీ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తప్పు చేసిన అధికారుల విషయంలో ఉపేక్షించబోమని, శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాలుష్య పరిశ్రమలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, విచారణను ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top