కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

Her Father Claimed That Himavati Was Killed About Dowry - Sakshi

భర్త శ్యామ్‌ కుమార్‌రెడ్డితోపాటు అతని తల్లిదండ్రులపై చర్య తీసుకోవాలి

బాధితుల డిమాండ్‌.. న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట, ఉద్రిక్తత

బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామారం మండలం పాత రంగాపూర్‌లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హైమావతిని ఆమె భర్త శ్యామ్‌కుమార్‌రెడ్డి, అత్తామామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం  బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పెద్దపర్వతాపూర్‌ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మూడు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. నిందితులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. సహనం కోల్పోయిన బాధితులు భువనగిరి రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి, స్ధానిక ఎస్‌ఐ మధుబాబుతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యేక పోలీసు, అదనపు బలగాల తోపులాటలు, బాధితుల రోదనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మృతురాలి భర్త శ్యామ్‌ కుమార్‌రెడ్డికి చెందిన కారును తన గేదెలషెడ్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. 

శాంతింపజేసిన ఏసీపీ
ఈనేపథ్యంలో ఘటనస్థలానికి చేరుకున్న ఏసీపీ భుజం గరావు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. తాత్కాలికంగా నిరసన విరమించిన తరుణంలో రోడ్డు క్లియరెన్స్‌కు భువనగిరి రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి పెద్దపర్వతాపూర్‌కు వెళ్లే రోడ్డు దాకా వెళ్లారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించాలని కొందరి యువకులను గద్దిస్తూ చేసు చేసుకున్నారు. యువకులపై సీఐ దాడి చేశారని తెలుసుకున్న పలువురు మహిళలు పోలీసులపై తిరగబడి దాడికి యత్నించారు. సహనం కోల్పోయిన పోలీసులు సైతం రోడ్డుపక్కనున్న చెట్ల కొమ్మలను విరిచి లాఠీచార్జ్‌కు ప్రయత్నించారు. కొద్ది సమయం పోలీసులకు.. మహిళలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఏసీపీ భుజంగరావు మరోసారి రంగప్రవేశం చేసి గ్రామస్తులను, మహిళలను సముదాయించారు. దీంతో హైమావతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భునవగిరి జిల్లా ఆస్పత్రికి వెళ్లారు.

 బాధితులకు న్యాయం చేస్తాం
అనుమానాస్పదస్థితిలో హైమావతి, ఆమె కూతురు నందిక మృతిచెందిన ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామని ఏసీపీ భుజంగరావు మరోసారి హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైమావతి భర్త శ్యామ్‌కుమార్‌రెడ్డితో పాటు అతని తల్లిదండ్రులపై అదనపు కట్నం వేధింపులు, హత్య కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. కాగా, నిందితులైన మర్రి శ్యామ్‌ కుమార్‌రెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top