నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ' | Heavy Rain at Midnight in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

Sep 28 2019 8:31 AM | Updated on Oct 11 2019 1:02 PM

Heavy Rain at Midnight in Hyderabad - Sakshi

నాచారం: ఎర్రగుట్ట చెరువు అలుగు పోయడంతో కాలనీలోకి చేరిన వరద ప్రవాహం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ కుండపోత కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. గుడిమల్కాపూర్, రెడ్‌హిల్స్, నాంపల్లి, శ్రీనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్‌నగర్‌తో పాటు చాలా ప్రాంతాల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ గోదారులయ్యాయి. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, జోనల్‌ కమిషనర్లు, విజిలెన్స్‌ డైరెక్టర్‌  విశ్వజిత్‌ కాంపాటిలతో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తం చేశారు. నీట మునిగిన ప్రాంతాలకు వెంటనే మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను పంపించి సహాయ చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు (డీఆర్‌ఎఫ్‌)తొలగించాయి. హుస్సేన్‌సాగర్‌ నాలా గోడ ఒకవైపు పాక్షికంగా కూలడంతో రాజ్‌భవన్‌ ఎదురుగా ఉన్న ఎంఎస్‌ మక్తా బస్తీలోకి వరద చేరడంతో జలమయమైంది. దాదాపు 200 ఇళ్లకు పైగా నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మేయర్‌ అక్కడికి డీఆర్‌ఎఫ్, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను పంపించడంతో పాటు తెల్లవారుజామున 4గంటలకు ఆయనా మక్తాకు చేరుకున్నారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం శ్రీనగర్‌కాలనీలోని ప్రధాన రహదారిపై కూలిన చెట్టును దగ్గరుండి తొలగింపజేశారు. ఖైరతాబాద్‌ డివిజన్‌లోని మారుతీనగర్, రాజ్‌నగర్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో వరద నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. మేయర్‌ వెంట డివిజన్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉన్నారు.

ఆపద్బాంధవులు...  
డీఆర్‌ఎఫ్, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు సకాలంలో స్పందించి నగరవాసులను రక్షించాయి. జలమయమైన బస్తీలు, కాలనీల్లో ఇబ్బందులు లేకుండా చూశాయి. ముఖ్యంగా బేగంపేట్, ఆనంద్‌బాగ్, చందానగర్, కూకట్‌పల్లి, చార్మినార్‌ సర్కిల్‌లోని పలు ప్రాంతాలకు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో ప్రత్యేక బోట్‌ల ద్వారా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పాలు, బ్రెడ్‌ తదితర అందజేశాయి. ఈ బృందాలు సకాలంలో స్పందించడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.  

ఆపరేషన్‌ థియేటర్‌లోకి డ్రైనేజీ...  
ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం శిథిలావస్థకు చేరుకుంది. తరచూ పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే ఈ భవనం రెండో అంతస్తును పూర్తిగా ఖాళీ చేసి ఆయా విభాగాలను గ్రౌండ్‌ఫ్లోర్‌కు తరలించారు. ప్రస్తుతం కురుస్తున వర్షాలకు గోడలు నాని కూలుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పడు ఏ ముప్పు వస్తుందోనని వైద్యులు, రోగులు భయపడుతున్నారు. గోడలకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. స్లాబ్‌పై నీరు నిల్వ ఉండటం, లీకేజీలు ఏర్పడటంతో ఆపరేషన్‌ థియేటర్లు, వార్డుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఫలితంగా యూరాలజీ ఆపరేషన్‌ థియేటర్‌లో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు చేరడంతో గత నాలుగు రోజులుగా చికిత్సలు నిలిపివేశారు. చేసేదేమీ లేక ఆపరేషన్‌ థియేటర్‌కు తాళం వేశారు.  

పసిపాపను రక్షించిన బృందం  
శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో డయల్‌ 100 ద్వారా అందిన సమాచారంతో సమీపంలోని టీమ్‌8 తిరుమలగిరికి చేరుకుంది. మూడు నెలల పసిపాప సహా తల్లి వరదలో చిక్కుకోవడంతో డిజాస్టర్‌ రెస్క్యూ బృందం లైఫ్‌ జాకెట్‌తో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.   

‘నిమ్స్‌’లో విద్యుత్‌ షాక్‌
పంజగుట్ట: చినుకు పడితే చాలు వైద్యులు, రోగుల వెన్నులో వణుకు పుడుతోంది. ఓవైపు ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మరోవైపు భారీ వర్షాలు కురవడంతో భవనాల స్లాబ్‌లు, గోడల నుంచి నీరు లీకవుతోంది. వర్షపు నీరు వార్డుల్లోకి చేరుతోంది. గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నిమ్స్‌ ఆస్పత్రి ఫిజియోథెరపీ భవనంలోని వార్డుల్లోకి వరద వచ్చింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పైకప్పులతో పాటు గోడలన్నీ తడిసి ముద్దయ్యాయి. జాయింట్ల వద్ద వైర్లు తేలి ఉండడం, స్విచ్‌బాక్స్‌లు తడిసిపోవడంతో గోడలు షాక్‌ కొట్టాయి. దీంతో సిబ్బంది, రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమై వార్డును మూసివేశారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మతులు నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు విన్నవించినా... పట్టించుకోలేదని వైద్యులు వాపోయారు. వర్షం వల్ల పలు విభాగాల్లోని సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో ఓపీ, ఐపీ కార్డుల జారీలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

వరద..వ్యధ
వర్షానికి పాతబస్తీ అతలాకుతలమైంది. వరద వెళ్లడానికి సరైన మార్గాలు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మీరాలం చెరువు నుంచి వరద జూలోకి రావడంతో లయన్‌ సఫారీని మూసేశారు. ఎన్‌క్లోజర్లలో భారీగా వరద చేరడంతో శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటల తర్వాత సందర్శకులను అనుమతించారు. 
ఉప్పల్‌ నియోజకవర్గంలో వర్షానికి రోడ్లు జలమయం కావడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 35 కాలనీల ప్రజలు బోడుప్పల్‌ వయా నల్ల చెరువు మీదుగా ఉప్పల్‌కు చేరుకోవాల్సి వచ్చింది. నాచారం హెచ్‌ఎంటీనగర్‌ నుంచి నాలా ఉప్పొంగుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. సికింద్రాబాద్‌ వెళ్లేవారు నాచారం, హబ్సిగూడ మీదుగా వెళ్లారు.  
మల్కాజిగిరి నియోజకవర్గంలో జలమయమైన కాలనీలను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ పరిశీలించారు. అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి.  
కుత్బుల్లాపూర్‌ పరిధిలో నాలాలు పొంగిపొర్లడంతో రుక్మిణి ఎస్టేట్స్, వెంకన్న హిల్స్, సాయినగర్, శ్రీనివాస్‌నగర్, కాకతీయనగర్‌ తదితర ప్రాంతాల్లో నడుం లోతు వరకు వరద చేరింది. జోనల్‌ కమిషనర్‌ మమత ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
కంటోన్మెంట్‌ నియోజవర్గంలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్టుమెంట్స్‌లోని సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది. రసూల్‌పురాలోని 105 గల్లీ, సీబీఎన్‌నగర్, ఇందిరమ్మానగర్, మార్గదర్శి కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ కాలనీ, 3వార్డు పరిధిలోని బాలంరాయి సుభాష్‌హట్స్, విమాననగర్‌ కాలనీ, పైగా కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ నగర్, కార్ఖానా తహారా గల్లీ పూర్తిగా జలమయమయ్యాయి.   
కంటోన్మెంట్‌ ఐదో వార్డు సంజీవయ్యనగర్, పద్మజా కాలనీ, వాసవీనగర్, ఎస్‌బీఐ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాలుగో వార్డు ఎల్‌ఐసీ కాలనీలో కంటోన్మెంట్‌ డిపో వద్ద నాలాను ఆనుకుని ఉన్న ప్రహరీ కూలిపోయింది. దీంతో నాలా ప్రవాహం ఎల్‌ఐసీ కాలనీని ముంచెత్తింది. వరద నీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
ఎల్‌బీనర్‌ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్‌ షిర్డీ సాయినగర్‌ కాలనీ, హస్తినాపురం సెంట్రల్‌ కాలనీలో కుండపోత కురిసింది. లింగోజిగూడ డివిజన్‌ పరిధిలోని గ్రీన్‌ పార్కు కాలనీ, నాగోలు డివిజన్‌లోని అన్ని కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మన్సూరాబాద్‌ డివిజన్‌ ఆగమయ్య నగర్‌ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.  
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీప్తిశ్రీనగర్, జనప్రియ కాలనీల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లింగంపల్లి ఆర్‌యూబీ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొందరు రైల్వేస్టేషన్, నల్లగండ్ల బ్రిడ్జి ద్వారా రాకపోకలు సాగించారు. భెల్‌ ఎంఐజీ కాలనీలో భారీ చెట్టు కూలిపోయింది.
కుండపోతతో అంబర్‌పేటలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అలీకేఫ్‌ చౌరస్తా వద్ద భారీ గుంత ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.  
హుస్సేన్‌సాగర్‌ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 
టోలిచౌకీ నిజాం కాలనీలో డ్రైనేజీ రోడ్లపై ప్రవహిస్తుండడంతో ఇబ్బందికరంగా ఉంది. గోల్కొండ హీరాఖానా, టోలిచౌకీ, గుడిమల్కాపూర్‌ తదితర ప్రాంతాల్లో వరద ప్రవహిస్తోంది. నదీం కాలనీలో 200 ఇళ్లల్లోకి వరద చేరింది.   

ఫిర్యాదులు ఇలా...
గురువారం ఉదయం 6గంటల నుంచిశుక్రవారం రాత్రి 7:50 గంటల వరకుజీహెచ్‌ఎంసీకి అందిన ఫిర్యాదులు కూలిన చెట్లు 17 , నీటి నిల్వలు 44

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement