
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల వచ్చే మూడ్రోజుల పాటు తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మధ్య వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల ఈ నెల 19 వరకు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే 24 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది.
ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 19 సెంటీమీటర్లు, కొమురంభీం జిల్లాలో 17 సెం.మీ., ఆసిఫాబాద్‌లో 13 సెం.మీ., కాళేశ్వరంలో 11 సెం.మీ., ఉట్నూర్, ఆదిలాబాద్‌లో 11 సెం.మీ., మంచిర్యాల చెన్నూర్‌లో 11సెం.మీ., పెద్దపల్లి, మంథనిలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్‌లో 6 సెం.మీ., రాజన్న సిరిసిల్లలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించింది.