సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలో నల్లగొండ మినహా మిగిలినచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 13 డిగ్రీలు, మెదక్‌లో 14 డిగ్రీలు రికార్డు అయింది. ఖమ్మంలో 16 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేట్, హైదరాబాద్‌లలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, రామగుండంలలో 18 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు అన్నిచోట్లా సాధారణం కంటే ఒకటి నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. అత్యంత ఎక్కువగా మెదక్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.