
సాక్షి, కరీంనగర్ : టిక్‌టాక్ వీడియోలు చేస్తూ .. యువత ప్రాణాలు తీసుకుంటోంది. దీనికి మరికొంత ముందడుగుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి కార్యాలయాల్లో టిక్‌టాక్‌లు చేస్తూ.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. అలాంటి సంఘటనే కరీంనగర్ ఆరోగ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘టిక్‌టాక్’ వీడియో చేసిన ముగ్గురు మహిళా ఉద్యోగులపై వేటు పడింది. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి.. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో టిక్టాక్ వీడియోలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ సమత, దివ్యమణి, ల్యాబ్ అటెండర్ జయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామ్ మనోహర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో పాటు.. వీడియోపై సాక్షి మీడియాలో కథనం ప్రసారం కావటంతో విచారణ జరిపి ఆ ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రామ్ మనోహర్ తెలిపారు. ఇటీవలి కాలంలో గాంధీ ఆస్పత్రిలోని ఉద్యోగులు టిక్‌టాక్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగులు కూడా టిక్ టాక్ చేసి వార్తల్లోకి ఎక్కిన విషయం విధితమే.