‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ ప్రాజెక్టు అధికారి వేధింపులు 

Health and wellness project officer harassment - Sakshi

ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం వద్ద ఆరోగ్య కార్యకర్తల ధర్నా

చెదరగొట్టిన పోలీసులు.. 

విచారణకు మంత్రి ఈటల ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌లో హెల్త్‌ అండ్‌ వెల్‌ నెస్‌ కేంద్రాల ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న సత్య తమను వేధిస్తున్నాడంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు (ఎంఎల్‌ హెచ్‌వో) హైదరాబాద్‌ కోఠీలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రాజెక్టు ఆఫీసర్‌ సత్యను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 5 గంటల సేపు ఆందోళన చేసిన వారు, ఒక దశలో కమిషనర్‌ యోగితా రాణా కారును అడ్డగించారు. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో కార్యాలయ ప్రాంగణమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

రాష్ట్రంలో కూడా 500 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలుగా మార్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పారు. వీటిలో పనిచేసేందుకు గతేడాది వైద్య ఆరోగ్యశాఖ రాత పరీక్ష నిర్వహించి 76 మంది స్టాఫ్‌ నర్సులను ఎంఎల్‌హెచ్‌వోలుగా కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఈ కార్యక్రమమంతా జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా చేపట్టారు. నియమించే సమయంలో వీరి స్థానిక ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగ అవకాశమిస్తారని అధికారులు తెలిపారు. కానీ ఒక జిల్లాలో ఉన్న వారిని మరో జిల్లాలో ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో వేశారు. అలాగే ఈ ఏడాది జూన్‌ మొదటి నుంచి వారు ఎక్కడ పనిచేస్తున్నది, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లింది ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆఫీసర్‌కు తెలిసేలా స్మార్ట్‌ ఫోన్లో లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయమని ఆదేశాలు జారీ చేశారు. 

అర్ధరాత్రి అధికారి ఫోన్లు.. 
ఇంతవరకు బాగానే ఉన్నా ప్రాజెక్టు ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్న సత్య అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తమకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడని, అవసరం లేకపోయినా కూడా కార్యక్రమాల వివరాలను తెలపాలని కోరుతున్నారని ధర్నా చేసిన స్టాఫ్‌ నర్సులు ఆరోపించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే తమ డ్యూటీ అని, కానీ రాత్రి 10–11 గంటల సమయంలో కూడా ప్రాజెక్టు ఆఫీసర్‌ తమకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధా నంగా ఆయన వేధింపులు ఆపాలని, నిబంధనల ప్రకారం స్థానికంగా ఉన్న ప్రాంతాల్లోనే తమకు విధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆ అధికారిపై స్థానిక పోలీసు స్టేషన్లో వారంతా ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top