మాస్టారు కడుపు చల్లగా.

HeadMaster Service To The Students - Sakshi

మెదక్‌రూరల్‌: సేవ చేయాలనే తపన ఉంటే ఎదో ఒక రూపంలో చేయవచ్చని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నిరూపిస్తున్నాడు. ఆరేళ్లుగా వేసవిలో విద్యార్థులకు సొంత ఖర్చుతో అంబలి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే మెదక్‌ మండలం మక్తాభూపతిపూర్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం తారక సత్యనారాయణ. 
2011 నుంచి..
2011లో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విద్యార్థులను చూసి చలించారు. ఏదో రకంగా సేవచేయాలని ఆలోచించి 2012–13 నుంచి ప్రతి ఏడాది వేసవిలో ఒంటిపూట బడులు ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు ఉచితంగా అంబలిని అందిస్తున్నాడు.

1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఉదయం 10 నుండి 11 గంటల సమయంలో అంబలిని ఇస్తున్నారు. రాగులతో తయారుచేసిన అంబలిలో పోషక పదార్థాలు, కాల్షియం ఉంటాయని, అవి ఇస్తే విద్యార్థులు ఆదర్శంగా ఉంటారని హెచ్‌ఎం సత్యనారాయణ చెబుతున్నారు. 

ప్రతిభ చూపిన విద్యార్థులకుప్రోత్సాహం..

సేవాకార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు సత్యనారాయణ ప్రోత్సాహం అందిస్తున్నాడు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతీ ఏడు చివరి పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచే ఒక్కో విద్యార్థి«కి రూ. 200 చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందిస్తున్నాడు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలలో మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ఏటా రూ. 500 చొప్పున బహుమతిగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని..

 ఎండాకాలంలో రాగులతో తయారు చేసిన అంబలి విద్యార్థులకు ఆరోగ్యకరం. అంబలిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంబలి సేవించడంతో రక్తం శుద్ధి కావడంతో పాటు ఎముకలు గట్టిపడుతాయి.

నేను పనిచేస్తున్న పాఠశాలలో చదవుకునే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో నా వంతు సహాకారం అందిస్తున్నాను. విద్యార్థులకు వేసవిలో ఉపశమనం కలిగేలా అండలి అందించడం ఆనందంగా ఉంది.     –సత్యనారాయణ, హెచ్‌ఎం, మక్తాభూపతిపూర్‌
                                   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top