పంచాయతీలదే పూర్తి బాధ్యత 

Haritha Haram Scheme Attached In Panchayats - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమ సంపూర్ణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా హరితహారం కార్యక్రమం కింద నర్సరీల్లో మొక్కలను పెంచడం, వాటిని నాటించడం, సంరక్షించడం అంతా పంచాయతీలకే ప్రభుత్వం అప్పగించింది. గతంలో హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీల ఆధ్వర్యంలోనే నిర్వహించినా వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడంతో అందరి సహకారంతోనే హరితహారం కార్యక్రమం కొనసాగింది. అయితే ఇప్పటి నుంచి పంచాయతీలే హరితహారానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. గతంలో రెండు మూడు గ్రామాలకు ఒక నర్సరీని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలు వేరు వేరుగా నర్సరీలను నిర్వహించి గ్రామాలకు అవసరమైన మొక్కలను సరఫరా చేశారు.

అయితే సవరించిన పంచాయతీరాజ్‌ చట్టంలో హరితహారం కార్యక్రమ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ నర్సరీలను నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 656 గ్రామ పంచాయతీలు ఉండగా అంతే మొత్తంలో నర్సరీలను ఏర్పాటు చేశారు.  వచ్చే జూన్, జూలై మాసాల్లో హరితహా రం ఐదవ విడత కార్యక్రమాన్ని నిర్వహించనుండటంతో ఈ కార్యక్రమం పూర్తిగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలోనే సాగనుంది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, ఎక్సైజ్‌ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు హరితహారం బాధ్యతలను నిర్వహించాయి. ఇక నుంచి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే అన్ని శాఖలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.

గ్రామానికి 40 వేల మొక్కలు.. 
హరితహారం కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఏటా 40 వేల మొక్కలను నాటించాలని ప్రభుత్వం గతంలోనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించడంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించారు. ఇప్పుడు మాత్రం పంచాయతీల ప్రతినిధులు ఈ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. కాగా భౌగోళికంగా చిన్నగా ఉన్న పంచాయతీల్లో ఇంత మొత్తంలో మొక్కలు నాటడం సాధ్యం అవుతుందా లేదా అనే సంశయం వ్యక్తం అవుతోంది. మేజర్‌ పంచాయతీలు, భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామాలలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం సాధ్యం అవుతుంది. చిన్న పంచాయతీల్లో మాత్రం భారీ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తరుణంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా వాటికి ప్రభుత్వం పెద్ద బాధ్యతనే అప్పగించిందని అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top