'హరితహారం మొక్కుబడిగా భావించొద్దు'

Harish-Rao Says, Dont Consider Haritha Haram Programme As Negligance - Sakshi

ఎమ్మెల్యే హరీశ్‌ రావు

సాక్షి, సిద్దిపేట : రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. రాబోయే తరాలకు విషపూరితమైన గాలి అందే ప్రమా దం ఉంది. దీనిని నివారించేందుకు ఇప్పుటి నుంచే మొక్కలు నాటాలి. ప్రతీ గ్రామం ఆకుపచ్చ గా కనిపించాలి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభం అయిన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో సిద్దిపేట అర్బన్‌ పార్కులో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరిత హారంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు పొందిన ఇబ్రహీంపూర్, చిన్నకోడూరు, ఇర్కొడ్‌ గ్రామాల సర్పంచ్, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు వారు మొక్కలు పెంచిన తీరును వివరించారు. అదేవిధంగా జిల్లాలో అత్యధిక మొక్కలు పెరగడానికి తీసుకున్న జాగ్రత్తలు డీఎఫ్‌వో శ్రీధర్‌రావు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మానవ మనుగడ మొక్కలతో ముడిపడి ఉందన్నారు. కొత్తగా గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మొక్కలు నాటడం చాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు.

హరితహారం లక్ష్యం గ్రామానికి 10వేలతోపాటు, సర్పంచ్, ఎంపీటీసీలు చెరొక వెయ్యి మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం గ్రామాల్లోని వివిధ కులవృత్తుల వారికి ఉపయోగరకమైన మొక్కలను ఇచ్చి వారి ప్రొత్సహిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. రోడ్డుకు ఇరువైపుల, బడి, గుడి, చెరువు కట్టలు, పొలం గట్లు ఇలా దేన్నీ వదలకుండా ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటాలని చెప్పారు. అదేవిధంగా పుట్టిన రోజు, మరణించిన రోజుల్లో కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

దీంతో స్మృతివనాలు, శ్మశాన వాటికలు కూడా ఆకర్షనీయంగా, ఆహ్లాదంగా కన్పిస్తాయన్నారు. పెద్ద మొక్కలు నాటితే త్వరగా నాటుకుంటాయని, ట్రీగార్డు అవసరం లేకుండా పోతుందన్నారు. గ్రామాల్లో పేదవారు చనిపోతే వారి దహన సంస్కరణలకు గ్రామ పంచాయతీ ఖర్చుచేయాలని, అందుకు రూ.10లక్షల మూల నిధి సిద్ధం చేసుకుంటామని గుర్రాలగొంది సర్పంచ్‌ ఆంజనేయులు సూచన అభినందనీయమని, జిల్లా అధికారులతో చర్చించి కార్యరూపం దాల్చుతామని తెలిపారు. మొక్కలు నాటుతాం. వాటిని సంరక్షిస్తామని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో హరీశ్‌రావు హరిత ప్రతిజ్ఞ చేయించారు.

జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లా హరితహారం కార్యక్రమంలో ఆదర్శంగా ఉందన్నారు. ఈ విడత రైతులను ఎక్కువగా భాగస్వామ్యం చేసి పొలం గట్లపై కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని చెప్పారు. పేదవారి దహన సంస్కరణలకు గ్రామ పంచాయతీ మూలనిధి కోసం జిల్లా అభివృద్ధి నిధుల నుంచి గ్రామానికో లక్ష కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. జలశక్తి అభియాన్‌ కేంద్ర బృందం సభ్యులు అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. హరితహారం, ఇతర కార్యక్రమాల్లో సిద్దిపేట ముందు వరుసలో ఉందన్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటడం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, డీపీవో సురేష్‌కుమార్, డీఆర్‌డీవో గోపాల్, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ మారెడ్డి రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top