హైదరాబాద్.. షాన్‌దార్ సిటీ | Gutta Jwala speaks about Hyderabad city with Sakshi city plus | Sakshi
Sakshi News home page

హైదరాబాద్.. షాన్‌దార్ సిటీ

Jun 24 2014 12:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

లవ్ ఆల్.. గుత్తా జ్వాల ఎంతో ఇష్టంగా తన చేతిపై వేసుకున్న టాటూ! అందరినీ ప్రేమించాలని చెప్పే ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా మంది. అయితేనేం నేను.. నా ఇష్టం అని బిందాస్‌గా బతికేయడం జ్వాల

లవ్ ఆల్.. గుత్తా జ్వాల ఎంతో ఇష్టంగా తన చేతిపై వేసుకున్న టాటూ! అందరినీ ప్రేమించాలని చెప్పే ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా మంది. అయితేనేం నేను.. నా ఇష్టం అని బిందాస్‌గా బతికేయడం జ్వాల  నైజం. నడక నేర్చినప్పటి నుంచి స్టార్ క్రీడాకారిణిగా ఎదిగినప్పటి వరకు ఆమె ప్రతి మలుపునకూ హైదరాబాద్ సాక్షి. అందుకే నగరంతో జ్వాలకు ఓ ప్రత్యేక అనుబంధం. ప్రపంచంలో ఏ మూల  తిరిగినా భాగ్యనగరిలో ఉండే ఆనందం ఎక్కడా దొరకదని  అంటున్న జ్వాల మహానగరం గురించి ఏం చెప్పిందంటే...  
 
 సిటీని చుట్టేసేదాన్ని...
 నాన్న మొదటి నుంచి ఆటలను ప్రోత్సహించారు. అందుకోసమే కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో చేర్పించారు. అయితే వేర్వేరు కారణాలతో బొల్లారం, పికెట్, గోల్కొండ కేవీలలోనూ చదివాను. అప్పట్లో నాన్నతో కలసి హైదరాబాద్ మొత్తం చుట్టేసేదాన్ని. ఇంటి నుంచి స్కూల్ దూరంగా ఉండటం వల్ల స్కూటర్‌పైనే ప్రయాణించేదాన్ని. బేగంపేట నుంచి గోల్కొండ, ఆర్టిలరీ సెంటర్ నుంచి ఆదర్శ్‌నగర్, ఆ తర్వాత బంజారాహిల్స్.. ఇలా నగరంలో చాలా ఇళ్లు మారాం.
 
  ‘భాగ్య’నగరమే..
 స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంలో హైదరాబాద్ పాత్ర ఎంతైనా ఉంది. ఇక్కడే రాకెట్ పట్టి టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్నా. హైదరాబాద్ ఎంతగా విస్తరించినా.. మన నగరానికి ఆత్మలాంటి సంస్కృతి మాత్రం మారలేదు. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు మన సిటీకే ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మొదలుకొని సందర్శకులకు ఇచ్చే ఆతిథ్యం వరకు చక్కటి కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల ఉబెర్ కప్ సందర్భంగా ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డా. ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఆలోచించేదాన్ని. టోర్నీల కోసం పర్యటనలే తప్ప నిజానికి నాకు ప్రయాణాలంటే పరమ చిరాకు. మన సిటీలో ఉన్నప్పుడే ఎంతో హాయిగా అనిపిస్తుంది.
 
 హార్ట్ కప్ కాఫీ
 హైదరాబాద్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫిట్‌నెస్ జాగ్రత్తలో భాగంగా ఎంత ఇష్టం ఉన్నా బిర్యానీని మాత్రం తక్కువగా తింటా. నగరంలో ఓవర్ ద మూన్, ఎన్ గ్రిల్ వంటి చోట్లకు బాగా వెళ్లేదాన్ని. ప్రస్తుతం నా ఫేవరేట్ స్పాట్ మాదాపూర్‌లోని ‘హార్ట్ కప్ కాఫీ’
 
 సిటీ సిక్..
 మహా నగరంలో ఇబ్బందులు కొన్ని తప్పవు. అయితే నా వైపు నుంచి ఒక్కటే ఫిర్యాదు.. ట్రాఫిక్ గురించే.  గతంతో పోలిస్తే ఇదొక్కటే ఇబ్బంది పెట్టే మార్పు. వర్షాకాలంలో రోడ్లు సమస్యగా అనిపిస్తాయి. కానీ, ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగు. విదేశాల్లో మెరిసిపోయే సిటీస్ ఉన్నా ఎందుకో ఏ మాత్రం నచ్చవు. టోర్నీ కోసం విదేశాలకు వెళితే నేను ఎయిర్‌పోర్ట్, స్టేడియం.. హోటల్‌కే పరిమితం.
 
 గాజులంటే మోజు..
 హైదరాబాద్‌లో నేను తిరగని ప్రదేశం లేదు. చిన్నప్పుడే పాతబస్తీ అంతా చుట్టేశా. అక్కడ చాలా మంది  ఫ్రెండ్‌‌స ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల కోసం ఇక్కడే షాపింగ్ చేస్తా. నాకు గాజులంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ప్రపంచంలోని అన్ని రంగుల, లెక్కపెట్టలేనన్ని రకాల గాజుల సెట్‌లు ఉన్నాయి. పెద్ద ఎత్తున చీరల కలెక్షన్‌కూడా ఉంది.
 
 ఫ్రెండ్స్‌తో కలసి ప్రేమికుడు సినిమా..
 నాకైతే హైదరాబాద్‌లో సినిమాలే పెద్ద వినోదం. రామకృష్ణ, మహేశ్వరి-పరమేశ్వరి, ఆనంద్, సుదర్శన్, శాంతి.. ఇలా అన్ని థియేటర్లలోనూ సినిమాలు చూశాను. అమీర్‌పేట సత్యంలో ఫ్రెండ్‌‌సతో కలసి ప్రేమికుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం మరపురాని జ్ఞాపకం. అన్నట్లు సికింద్రాబాద్  కేవీ స్కూల్‌కు దగ్గర్లోనే లాంబా థియేటర్ ఉన్నా ఆ ఛాయలకు పోలేదు లెండి (నవ్వుతూ).
 
 హైదరాబాద్ బ్రాండ్ తగ్గదు

 కొత్త రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఉండాలనేదే నా కోరిక. బ్రాండ్ హైదరాబాద్ విలువ ఎప్పటికీ తగ్గదు. సిటీ చరిష్మాను ఎవరూ తగ్గించలేరు. టు బి ఫ్రాంక్.. ది బెస్ట్ సిటీలో నేనుంటున్నానని ఆనందంగా, గర్వంగా చెప్పగలను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement