గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
►రైతులకు కుచ్చుటోపీ..
►అనుమతి లేని వేరుశనగ విత్తనాల విక్రయం
►పట్టించుకోని అధికారులు
దుగ్గొండి : గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు నకిలీ వేరుశనగ విత్తనాలు అంటుగడుతున్నారు. ఇవి నాణ్యమైన విత్తనాలని, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని చెపుతూ అనుమతి లేని సీడ్స్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో స్థానికంగా ఉండే ఓ ఫెర్టిలైజర్ షాపు డీలర్ ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి ట్యాగ్-24 రకం వేరుశనగ విత్తనాలంటూ రైతులకు మాయమాటలు చెప్పి వాస్తవ ధరకన్నా రూ.600 పెంచి అమ్ముతున్నాడు. ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు.
ఇప్పటికే గ్రామంలో వెయ్యి బస్తాల(దాదాపు 300 క్వింటాళ్ల) విత్తనాలు విక్రయించినట్లు తెలిసింది. అయితే కర్నూలు విత్తనాలు అని చెప్పి వరంగల్ మార్కెట్ పరిధిలోని ఓ వేరుశనగ వ్యాపారి వద్ద కొనుగోలు చేసి ట్యాగ్ -24 పేరుతో ముద్రించిన బ్యాగుల్లో నింపి విక్రయిస్తున్నాడని సమాచారం. అధిక ధరకు నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తున్నారని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి దయాకర్‌ను వివరణ కోరగా ఇతర ప్రాంతాల నుంచి వేరుశనగ విత్తనాలు తెచ్చి విక్రయిస్తున్నారని గత రెండు రోజుల క్రితమే రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేస్తే తమ బాధ్యత లేదన్నారు. చట్టవిరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.